Thursday, January 30, 2025

AP – రైల్వే హబ్ గా విజయవాడ.. ఎంపీ కేశినేని శివ‌నాథ్‌..

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) ప్ర‌జ‌ల విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిప‌డిన ప్రాజెక్టులు, అభివృద్ధి ప‌నులను స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో స‌త్వ‌రం పూర్తిచేసేందుకు అవ‌స‌ర‌మైన డీపీఆర్‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన సిద్ధం చేయాల‌ని, ఇప్ప‌టికే చేప‌ట్టిన ప‌నుల పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌లు డివిజ‌న‌ల్ రైల్వే మేనేజ‌ర్ (డీఆర్ఎం) న‌రేంద్ర ఎ.పాటిల్ దృష్టికి తీసుకొచ్చారు.


రైల్వేతో ముడిప‌డిన ప్రాజెక్టులు, అభివృద్ది ప‌నులు పూర్తిచేసేందుకు బుధ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ అధ్య‌క్ష‌త‌న డీఆర్ఎం న‌రేంద్ర ఎ.పాటిల్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యుడు వ‌సంత వెంక‌టకృష్ణ ప్ర‌సాద్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ హెచ్‌.ఎం.ధ్యాన‌చంద్ర.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మునిసిప‌ల్‌, ఆర్ అండ్ బీ, జాతీయ ర‌హ‌దారులు, ఇరిగేష‌న్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మ‌న్వ‌య స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

- Advertisement -

రైల్వేతో ముడిప‌డిన ఇంజ‌నీరింగ్‌, పారిశుద్ధ్యం, ప‌ట్ట‌ణ ప్రణాళిక‌, రెవెన్యూ, ఎస్టేట్ సెక్ష‌న్ల అంశాల‌పై స‌మావేశం దృష్టిసారించింది. విజ‌య‌వాడ‌ను ఇబ్బందిపెట్టిన వ‌ర‌ద‌లు పున‌రావృతం కాకుండా రైల్వే భాగ‌స్వామ్యంతో చేప‌ట్టాల్సిన ప‌నులు నిరాంటంకంగా కొన‌సాగేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. డ్రెయిన్లలో పూడిక‌తీత‌, పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలతో పాటు మ్యాన్‌హోళ్ల వ‌ద్ద తేలియాడే చెత్తాచెదారం తొల‌గింపు, సీసీ అప్రోచ్, ఆర్‌వోబీ/ఆర్‌యూబీల మంజూరు, నిర్మాణం, ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు, డీపీఆర్‌ల త‌యారీపై కూలంక‌షంగా చ‌ర్చించి, త‌క్ష‌ణ కార్యాచ‌ర‌ణకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలిచ్చారు.

స‌మావేశంలో పార్ల‌మెంటు స‌భ్యుడు కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు, అండ‌ర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్య‌వ‌స్థ‌ల అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన డీపీఆర్‌ల‌ను వెంట‌నే సిద్ధం చేసి, అనుమ‌తులు సాధించేలా కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. రైల్వే ప్రాజెక్టులు, శాటిలైట్ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌, బుల్లెట్ ట్రైన్‌, మెట్రో లైన్ నిర్మాణం వంటి వాటిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చి అనుమ‌తులు, నిధులు మంజూరుకు త‌న‌వంతు కృషిచేసి, విజ‌య‌వాడ న‌గ‌రాన్ని రైల్వే హ‌బ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తాన‌ని వెల్ల‌డించారు.

గుణ‌ద‌ల వ‌ద్ద రోజుకు 180సార్లు గేటు ప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌లుతీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని.. ఈ నేప‌థ్యంలో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వంతెన ప‌నుల పూర్తికి కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. గుణ‌ద‌ల రైల్వే వంతెన‌కు సంబంధించిన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు స‌మ‌ర్పించ‌డం జ‌రిగింద‌ని, వీలైనంత త్వ‌ర‌లో అనుమ‌తుల మంజూరుకు కృషిచేస్తామ‌ని ఎంపీ శివ‌నాథ్ తెలిపారు. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు వ‌ల్ల విజ‌య‌వాడ న‌గ‌ర ప్ర‌జ‌లు ముంపుబారిన ప‌డి ఆర్థికంగా కోట్లాది రూపాయ‌లు న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చిందన్నారు. బుడ‌మేరు ఆధునికీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న త‌రుణంలో వాటికి అనుగుణంగా రైల్వేకు సంబంధించిన అండ‌ర్ పాస్‌లు, ఓవ‌ర్ బ్రిడ్జ్‌లు, డ్రెయిన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే అధికారులు ప్ర‌ణాళిక‌లు రూపొందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

వాంబే కాల‌నీ ఆర్‌వోబీ నిర్మాణంతో పాటు సింగ్ న‌గ‌ర్ – రామ‌కృష్ణాపురం అద‌న‌పు వెంట్ ఏర్పాటు పైనా దృష్టిపెట్టాల‌న్నారు. ప‌శ్చిమ‌లో వ‌న్‌టౌన్ ట్రాఫిక్ క‌ష్టాల‌ను తొల‌గించ‌డంతో పాటు సితార, చ‌ర్చి, శివాల‌యం వ‌ద్ద స‌ర్కిళ్ల అభివృద్ధికీ చొర‌వ‌చూపాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని శివ‌నాథ్ తెలిపారు.

క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రితో పాటు మంత్రులు, బుడ‌మేరు ఆధునికీక‌ర‌ణ‌తో పాటు విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టిపెట్ట‌డం జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా నిర్మాణాల‌కు అనువైన వేస‌విలో వివిధ అభివృద్ధి ప‌నుల పూర్తికి స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌తో, స‌మ‌న్వ‌యంతో ముందుకెళ్లాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. జిల్లా అధికార యంత్రాంగం, రైల్వే అధికారుల స‌మ‌న్వ‌యంతో ప్ర‌జావ‌స‌రాల‌ను తీర్చే ప్రాజెక్టులు, అభివృద్ధి ప‌నుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష నిర్వ‌హించి ప‌నులు పూర్తిచేసేందుకు కృషిచేస్తామ‌న్నారు. అవ‌స‌రం మేర‌కు త్వ‌రిత‌గ‌తిన జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్లు నిర్వ‌హించ‌నున్నామ‌ని తెలిపారు. న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు రైల్వేశాఖ చెల్లించాల్సిన బ‌కాయిల‌ను చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌ద్వారా న‌గ‌రాభివృద్ధికి మ‌రిన్ని నిధులు స‌మ‌కూరుతాయ‌న్నారు.

……స‌మ‌న్వ‌య స‌మావేశాల‌తో మెరుగైన ఫ‌లితాలు…..

రాష్ట్ర ముఖ్య‌మంత్రి రైల్వే ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించార‌ని, పెద్దఎత్తున ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్తున్నార‌ని, ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ రైల్వే డివిజ‌న్ ప‌రిధిలో ప‌నుల పూర్తికి ఇలాంటి స‌మ‌న్వ‌య స‌మావేశాలతో మెరుగైన ఫ‌లితాలు ఉంటాయ‌ని డీఆర్ఎం న‌రేంద్ర ఎ.పాటిల్ అన్నారు. వ‌చ్చే రెండేళ్ల స‌మ‌యం చాలా కీల‌క‌మైంద‌ని, స‌మ‌ష్టి కృషితో ప‌నుల స‌త్వ‌ర పూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేద్దామ‌న్నారు. భ‌ద్ర‌త దృష్ట్యా రైల్వే వంతెన‌ల నిర్వ‌హ‌ణ అత్యంత కీల‌క‌మైంద‌ని.. ఈ వంతెనల వ‌ద్ద చేప‌ట్టే డ్రెయిన్ల‌లో పూడిక‌తీత వంటి ప‌నుల‌ను వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో జాగ్ర‌త్త‌గా చేప‌ట్టేందుకు కృషిచేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీ న‌ర‌సిహం, సీనియ‌ర్ డివిజ‌న‌ల్ ఇంజ‌నీర్ (స‌మ‌న్వ‌యం) ఎస్‌.వ‌రుణ్‌బాబు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement