(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో ) – మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో, ఆయన నివాసంలో శనివారం ఉదయం పసుపు కండువా కప్పుకొని టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాదు వెంట ఆయన అభిమానులు మైలవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి హైదరాబాదుకు తరలివచ్చారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో పాటు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
పార్టీలోకి వసంత బలగం
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు మైలవరానికి చెందిన ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, ఆరుగురు ఎంపీటీసీలు, పన్నెండు మంది సర్పంచ్‌లు, ఏడుగురు సొసైటీ ప్రెసిడెంట్లు, నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత వసంత కృష్ణప్రసాద్ ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు చేస్తేనే ఆ పార్టీలో టికెట్ ఇస్తారని లేదంటే టికెట్ రాదని మండిపడ్డారు. ప్రతిపక్షాలను తిడితే మంత్రి పదవులు ఇస్తారని లేదంటే పట్టించుకోరని అసహనం వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్లే వైసీపీని వీడాల్సి వచ్చిందని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. వైసీపీలో తనకు ఎలాంటి గౌరవం దక్కలేదన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే తన కోరికన్నారు.కాగా.. మైలవరం టీడీపీ టికెట్‌పై వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని సర్వేల్లోనూ మైలవరంలో తానే గెలుస్తానని తేలిందన్నారు. జగన్ పిలిచి టికెట్ నీకేనని చెప్పినా వద్దని వచ్చేసినట్లు తెలిపారు. చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానని లేకపోతే పార్టీ కోసం పనిచేస్తానని కృష్ణప్రసాద్ తేల్చిచెప్పారు.