జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావులు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పిఠాపురంలో రాజకీయ పరిణామాలపై పవన్-వర్మ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పవన్ గెలుపునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని వర్మ తెలిపారు. గతంలో పిఠాపురం సీటు కోసం వర్మ పట్టుపట్టారు. చంద్రబాబు నచ్చజెప్పడంతో మెత్తబడ్డ వర్మ.. పవన్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.
ఇటీవల పవన్‌ను కూడా కలిసి మద్దతు పలికారు. తాజాగా మరోసారి పవన్‌ను వర్మ కలవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ తాను కాకినాడ ఎంపీగా వెళ్లాల్సి వస్తే చివరి క్షణంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన ఉదయ్.. పిఠాపురం నుంచి బరిలో ఉంటారని పవన్ ప్రకటించారు. ఈ క్రమంలో పవన్ పోటీ చేయని పక్షంలో ఆ సీటు తనకే ఇవ్వాలని వర్మ కోరారు. ఈ నేపథ్యంలో సీటు అంశమే మాట్లాడటానికి పవన్‌ను కలిశారా అనే చర్చ జరుగుతోంది.
మరో వైపు పవన్ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారానికి సంబంధించి చర్చించేందుకే వర్మ పవన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్ని సభలు ఏర్పాటు చేయాలి. పవన్ కల్యాణ్ ఎప్పుడు పిఠాపురం వస్తారు. ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించి.. సమన్వయం చేసుకునేందుకే పవన్‌ను కలిసినట్లు సమాచారం.