ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తా.
అర్జీదారులకు హోం మంత్రి హామీ.
ప్రజాదర్భార్ లో ఫిర్యాదుల వెల్లువ.
నక్కపల్లి – ఆంధ్రపభ – సమస్యలో ఉన్న ప్రజల కన్నీరు తుడుస్తా..వారి కష్టాలు తీరుస్తా నంటూ హోం మంత్రి వంగలపూడి అనిత భరోసానిచ్చారు.ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఉద్ఘాటించారు. నక్కపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆమె శుక్రవారం ప్రజదర్భార్ నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాలు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా హోం మంత్రి అర్జీలు స్వీకరించారు.
వారితో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.సుమారు 1000 కు పైగా అర్జీలు వచ్చాయి. భూ సమస్యలు, శాంతిభద్రతలు,కుటుంబ సమస్యలు, కొత్త ఫించన్లు,రేషన్ కార్డులు తదితర అంశాలపై అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా అధికారులతో పాటు పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల అధికారులు పాల్గొన్నారు.