వెలగపూడి – బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. గంటకు 5 కిలోమీటర్ల కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతూ ఏపీ తీరానికి సమాంతరంగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నాయి..
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై నేడు సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరించారు.
స్కూళ్లకు సెలవు…
భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు వివరించారు అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పడంతో వర్షాల అనంతరం పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు సీఎం.. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికిప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు సీఎం.
ఉత్తరాంధ్రలో వానలు…
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కుప్పకూలింది. ఇక, వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడించారు జిల్లా కలెక్టర్..