Wednesday, September 18, 2024

AP పవన్ కల్యాణ్ తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిపర్ లార్స‌న్ భేటీ ..

అమ‌రావ‌తి – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిపర్ లార్స్ న్ భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాల‌పై వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ప‌వ‌న్ క‌ల్యాణ్ యూఎస్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ దృష్టికి తీసుకెళ్లారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్ కళ్యాణ్ కోరారు.

వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా… అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా కఠిన చర్యలు

రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై మంగళవారం ఉదయం ఆరా తీశారు. వన్య ప్రాణులను, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా చట్టపరంగా కఠిన చర్యలలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం అరణ్య భవన్ లో నిర్వహించిన గ్లోబల్ టైగర్ డే కార్యక్రమంలో తను చదువుకొనే రోజుల్లో ఒంగోలులో అలుగును కొందరు వ్యక్తులు కొట్టి చంపడం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించానని ఈ సందర్భంగా పవన్ మరోసారి ప్రస్తావించారు.
విజయపురి సౌత్ అధికారులపై దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఉప ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement