ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని అన్నారు.
పార్టీ, ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటుచేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఏపీలో ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉంది అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో పార్టీ నీడ ప్రభుత్వంపై పడకూడదని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నామని చెప్పారు. ఎన్నికల అక్రమాలకు ఏపీ ప్రయోగశాలగా కాదని ఏకంగా వర్సిటీగా మారిందని ఆరోపించారు. ప్రజల్లో చైతన్యం ఉద్యమంగా మారలని అయన అభిప్రాయపడ్డారు. మనదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటు ఒక సాధనమని నిమ్మగడ్డ అన్నారు. నేటి యువత ఏది మంచి, ఏది చెడో తెలుసుకోవాలని, మెరుగైన సమాజానికి యువత తన వంతు పాత్ర పోషించాలని పిలుపు ఇచ్చారు.