కలిసేందుకు యత్నించిన సంజయ్, ఆంజనేయులు, రామిరెడ్డి
గేటు వద్ద నిలిపివేసిన భద్రతా సిబ్బంది
జగన్ హాయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆంజనేయులు
టీడీపీ అధినేతను అరెస్ట్ చేసిన కొల్లి రఘరామిరెడ్డి
సీఐడీ చీఫ్ గా చక్రం తిప్పిన సంజయ్
ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ ఎత్తేసిన ఎన్నికల సంఘం
టీడీపీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబును కలిసేందుకు యత్నించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు అనుమతి నిరాకరించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు గురువారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోగా అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. కాగా, ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆంజనేయులను ఎన్నికల సంఘం (ఈసీ) తప్పించింది. ఆ తర్వాత అనధికారికంగా వైసీపీ కోసం ఆయన పనిచేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పీఎస్‌ఆర్ కారును ఆపారు. లోపలికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు.
చంద్రబాబు అరెస్ట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్‌కు..
మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి కూడా చేదు అనుభవమే ఎదురైంది. చంద్రబాబును కలిసేందుకు ఫోన్‌లో అధికారులను ఆయన అనుమతి కోరగా తిరస్కరించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వైసీపీకి విధేయుడిగా ఉన్నారని ఈసీ కొరడా ఝుళిపించింది. డీజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ ఎత్తివేత
సాధారణ ఎన్నికల పోలింగ్ట్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేక పోయారనే కారణంతో అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లపై కేంద్ర ఎన్నికల సంఘం మే 16న సస్పెన్షన్ విధించింది. ప్రస్తుతం ఆ ఎస్పీలపై సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
సిఐడి చీఫ్ కూ….
ఇక చంద్రబాబును కలిసేందుకు సీఐడీ చీఫ్ సంజయ్ యత్నించారు. కరకట్ట గేటు వద్దే కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపి వెనక్కి పంపారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారు. అది కూడా రద్దయినట్లు సమాచారం. మర్యాదపూర్వక భేటీ పేరుతో సంజయ్ వచ్చిన విషయాన్ని అధికారులకు గేటు సిబ్బంది చెప్పారు. అనుమతి లేదని చెప్పడంతో ఆయన కారును వెనక్కి పంపారు.