Sunday, January 19, 2025

AP – గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి – వెంకయ్య నాయుడు పిలుపు

ఎన్టీఆర్ బ్యూరో :ఆంధ్రప్రభ – గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ఆదివారం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన – ఆదివాసి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో ఆదివాసులు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారి సహజసిద్ధ నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులను ప్రచారం చేయడం, వారి ఆదాయ వనరులను మెరుగు పరచడం ఎంతో ముఖ్యం. ఆదివాసీ – గిరిజన ఉత్పత్తులను, నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా వారి ఉత్పత్తుల స్థాయిని, విలువను పెంచడం సాధ్యమౌతుంది. గిరిజన సోదరులు వివిధ ఉత్పత్తులు, హస్త కళలకు సంబంధించి తమకు ఉండే సహజ సిద్ధ నైపుణ్యాలకు వ్యాపార విలువలను జోడించుకోవాలన్నారు. ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని. ప్రకృతి హితమైన వారి ఉత్పత్తులు సమాజానికి చేరువ కావలసిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

సేంద్రీయ ఆహారానికి, ఇతర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో గిరిజన సోదరులు ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద దృష్టి కేంద్రీకరించటం ద్వారా మరెంతో మందికి ఉపాధి అందించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆదివాసీ – గిరిజన యువకులు సాంకేతికతను అందిపుచ్చుకుని, ఈ ఉత్పత్తులను ప్రపంచంతో అనుసంధానించడం ద్వారా మంచి అభివృద్ధి సాధించవచ్చు అని సూచించారు. ఈ దిశగా ఆదివాసీ – గిరిజనులందరూ ఏకతాటి మీదకు రావలసిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్టీ వర్గాలకు ఎన్నో అవకాశాలను అందిస్తోందని వీటిని అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని తెలిపారు.

మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే, మీ కోసం వంద అడుగులు ముందుకు వేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని ఆదివాసీ – గిరిజన సోదరులు గ్రహించాలని చెప్పారు. ఆదివాసీలంటే తనకు ప్రత్యేకమైన అభిమానం, గౌరవం అని చెప్పారు. తాము జీవించటంతో పాటు, ప్రకృతిని కాపాడుకోవడానికి కట్టుబడిన వారి సంస్కృతి మహోన్నతమైనది అన్నారు.

మాతృ, పితృ ప్రేమను, పశు పోషణను ప్రేమిస్తూ… వైవిధ్యమైన తరహాలో కొనసాగే వారి జీవనం ఎంతో ఆదర్శనీయమైనదని,. మాతృమూర్తి, మాతృభాష, జన్మభూమి పట్ల వారికి ఉండే అవ్యాజమైన ఆప్యాయతానురాగాలు ఎంతో ప్రత్యేకమైనవన్నారు. స్వరాజ్య సంగ్రామంలో వారు ఎంతో విలువైన పాత్ర పోషించారని,భారతదేశ జనాభాలో ఆదీవాసీల సంఖ్య 8శాతం.. అంటే దాదాపుగా 10కోట్ల మంది ఆదీవాసీలు ఉన్నారని తెలిపారు. సమగ్రాభివృద్ధి (సబ్‌కా వికాస్) అనే జాతీయ లక్ష్యంలో ఆదీవాసీల అభివృద్ధి అనేది కూడా ఓ కీలకాంశం. అని చెప్పారు.

గిరిజన అభివృద్ధికి సంబంధించిన ఎన్నో సవాళ్లు, సమస్యలున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తోందన్నారు. ఒక జాతి అస్తిత్వం.. వారి సంస్కృతి పైనే ఆధారపడి ఉంటుందని. మిగిలిన అన్నిచోట్లా అనుసరించే అభివృద్ధి నమూనాలను.. ఆదీవాసీలకు కూడా అమలుచేసి వారి ప్రత్యేకమైన గుర్తింపును ధ్వంసం చేసే పద్ధతులను అనుమతించలేం అని అలా జరిగితే ఆదీవాసీలతోపాటు సమస్త మానవాళికి అది తీరని నష్టం చేసినట్లవుతుందన్నారు.

సామాజికంగా వారి అభివృద్ధిని సాధించటంతో పాటు, వారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడినప్పుడే మానవాళికి మేలు చేసిన వారి మౌతామన్నారు. అభివృద్ధి విషయంలో ఆదీవాసీలకు చాలా విషయాలను నేర్పించాల్సి ఉంటుందని పట్టణాల్లో ఉండే వాళ్లు అనుకుంటూ ఉంటారన్నారు. నిజానికి ఆదీవాసీల నుంచే పట్టణాల్లో ఉండే వారు నేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయాన్ని మనం మరిచిపోతున్నాం అని ఆదివాసీలంటే మూలవాసులని అర్థం అని. వారి జీవితం మన సనాతన విధానాలైన సత్యం, నైతిక విలువలు, నిరాడంబరతను ప్రతిబింబిస్తుందన్నారు.

నాటినుంచి ఇప్పటికీ సనాతన పద్ధతులను పాటిస్తూ నిరాడంబరంగా జీవించడమే ఆదివాసీల గొప్పదనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని వెంకయ్య నాయుడు అన్నారు..

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి. కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement