2023 డిసెంబర్ లో శ్రీకారం
ఇవ్పటికి 200 కార్యక్రమాలు
దేశ విదేశీ కళాకారుల ప్రదర్శనలు
రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ
వినూత్న ప్రయోగం సఫలం
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
సనాతన ధర్మాన్ని దేశ నలుదిశలా వ్యాపించేలా కార్యక్రమాలు
పేద కళాకారులకు ప్రోత్సాహం
ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో : ఆ స్వామి వెంకన్న కావొచ్చు.. మల్లన్న కావొచ్చు తన సతీసమేతంగా ధూపదీప నైవేద్యాలు స్వీకరించి.. అనంతరం కళారాదనలో పరవశించి.. పవళించటం ఆ స్వాముల నిత్యకృత్యం. ఇప్పటికే అనేక ఆలయాల్లో స్వాములోరి పవళింపు సేవలో కళాకృతులు నిత్యారాధనలో భాగస్వామ్యులే. ఇక భారత దేశంలోనే అతి పెద్ద మహిమాన్విత దేవాలయాల్లో రెండవ స్థానంలో నిలిచే ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గమల్లేశ్వర ఆలయంలో .. కేవలం దసరా ఉత్సవాల్లోనే మార్మోగే కళాసంబరం.. ఇటీవల కాలంలో దైనందిన కళారాధనగా మారిపోయింది. నిత్యం వందలాది కళాకారులు ఈ ఆలయ కళావేదికపై తమ కళలను ప్రదర్శించి కనక దుర్గమ్మ ఆశీస్సులు పొందుతున్నారు.
కళలను, కళాకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో..
పూర్వం రాజులు తమ రాజ్యాలలో కళలను కళాకారులను ప్రోత్సహించారు. కాలక్రమంలో రాజ్యాలు గతించాయి. రాజులూ కనుమరుగయ్యారు. రానురాను సమాజంలో అనేక మార్పులుతో వినోదంలో విభిన్న శైలి అంకురించింది. ప్రసార మాధ్యమాల రాకతో కొన్ని కళలు మరుగున పడ్డాయి. నేటి సమాజంలో కళలకు సరైన ఆదరణ లేదు. కళల ప్రదర్శనకు అవకాశం లేదు. ఇక కళాకారుల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి తరుణంలో కళలను, కళాకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు దేవాదాయ శాఖ సహకారంతో ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు జీవం పోస్తున్నారు. కానీ అవి పండుగలు ఉత్సవాలు, విశేష రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా కళాకారులకు సరైన ప్రాధాన్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం తలపెట్టిన మంచి కార్యక్రమంతో కళాకారులకు ఎలాంటి ఉపయోగం చేకూరటం లేదు.
ఇంద్రకీలాద్రిపై నిత్య కళారాధన
ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల్లోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కే.ఎస్.రామరావు.. ఇంద్ర కీలాద్రిపై నిత్యకళారాధనపై దృష్టి సారించారు. ఇప్పటి వరకూ ఇక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ పై అధికారులతో చర్చించారు. స్వయంగా ప్రణాళికను రచించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతినిత్య కళారాధనకు శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర్ నుంచి అనేక వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహణ చేపట్టారు. కళాకారులను ప్రోత్సహించే రీతిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. మరి ముఖ్యంగా అంతరించిపోతున్న తోలుబొమ్మలాట కార్యక్రమాలను నిర్వహించారు. దుర్గమ్మ తల్లికి నృత్య నీరాజనం అర్పించాలనే చిన్నారి కళాకారుల ఆశలను నెరవేర్చారు. ఇంద్రకీలాద్రిపై రాజగోపురం ఎదురుగా సర్వాంగ సుందరంగా ఓ వేదికను తీర్చిదిద్దారు. ప్రతిరోజు సాయంత్రం దుర్గమ్మ తల్లికి పంచహారతులు అనంతరం రెండు గంటల వ్యవధిలో కళాకారుల ఆరాధనకు అవకాశం ఇస్తున్నారు.
కళాకారులకు ప్రోత్సాహం..
ప్రతి రోజు సాయంత్రం చిన్నారి కళాకారులను, గురువులను, తల్లిదండ్రులను ఆలయ కార్యనిర్వహణ అధికారులు స్వయంగా అభినందిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం కళాకారులకు చిరు సత్కారం చేస్తున్నారు. కనక దుర్గమ్మ ప్రసాదాలు అందజేస్తున్నారు. కళల పట్ల కళలను ప్రోత్సహించే సదుద్దేశంతో సనాతన ధర్మాన్ని దేశం నలుదిశలా వ్యాపించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురువులను అభినందిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న విదేశీ కళాకారుల ప్రదర్శనలు..
కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, భక్తి రంజని, నారాయణ తీర్ధ తరంగాలు తదితర నృత్య కార్యక్రమాలకు సమాజంలో అవకాశాలు తగ్గుతున్న తరుణంలో హరికథ, బుర్రకథ కార్యక్రమాలు మరి ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో తోలు బొమ్మలాటను ప్రజలు మరిచి పోయిన తరుణంలో ఈ కార్యక్రమాన్ని కొండపై కళా వేదికలో ఏర్పాటు చేసి పేద కళాకారులను ఆదుకోవటం విశేషం.
ఈ నిత్య కళారాధన కార్యక్రమాల గురించి తెలుసుకున్న ప్రపంచ నలుమూలల్లోని అనేక మంది ప్రవాస భారతీయులు దుర్గమ్మ సన్నిధిలో కార్యక్రమాల నిర్వహణపై మిక్కిలి ఆసక్తి పెంచుకున్నారు. సింగపూర్, చైనా, దుబాయ్ సహా అనేక దేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 200లకు పైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మనదేశంలోని బెంగళూరు, చెన్నై, మణిపూర్, ఒరిస్సా వంటి రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు వచ్చి అమ్మవారి సన్నిధిలో తమ కళలను ప్రదర్శించటం అత్యంత గొప్ప విషయంగా చెప్పు కోవాలి. దుర్గమ్మ సన్నిధిలో తమ నృత్యం, గానం ప్రదర్శనలకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారికి చొరవవను అనేక విధాలుగా కళాకారులు కొనియాడుతున్నారు.