దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. కురుస్తున్న మంచు తుంపరులు… శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు… మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు. అంతా ప్రకృతి సోయగాలు, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడాలంటే కాశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ఆ ప్రదేశం ఉంది. దీనిని పర్యాటక ప్రియులు ముద్దుగా ‘కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ గా పిలుస్తారు.
ఏటా డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ ప్రాంతం ‘ఆంధ్రా కశ్మీర్’గా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది కూడా అతి కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ఇక్కడి గ్రామాల్లో మంచు దుప్పట్లు మరింతగా పరచుకున్నాయి. గత కొద్ది రోజులుగా చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైంది. అక్కడి మంచు అందాలను ఆస్వాదిస్తూ.. పర్యాటకులు పరవశించిపోతున్నారు.
పర్యాటకంగా ప్రాముఖ్యం సంతరించుకోవడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖపట్నం నుంచి లంబసింగి ప్రాంతానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. లంబసింగితో పాటు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు పరిసర ప్రాంతాలను ఒకే రోజులో చూపించేవిధంగా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజాగా లంబసింగి అందాలను తెల్లవారుజామునే వీక్షించేందుకు ఏపీ టూరిజంశాఖ ప్రత్యేకప్యాకేజీ ప్రకటించింది. విశాఖ హరిత హోటల్ నుంచి రోజూ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. లంబసింగిలోనే పర్యాటకులు బసచేసి పాడేరు ప్రకృతి అందాలు, జలపాతాలు వీక్షించొచ్చు.