Friday, November 22, 2024

ఆయిల్‌ పామ్‌లో ఏపీ టాప్‌.. గోదావరి జిల్లాల్లో అత్యధిక సాగు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆయిల్‌ పామ్‌ సాగులో ఏపీ అగ్రగామిగా దూసుకుపోతోంది. విస్తీర్ణం, దిగుబడిపై 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మదింపు చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాపిత ఆయిల్‌ పామ్‌ విస్తీర్ణంలో 48.51 శాతం, ఉత్పత్తిలో 88.24 శాతం వాటాను ఏపీ సొంతం చేసుకుంది. గడిచిన మూడేళ్ళుగా ఆయిల్‌ పామ్‌ సాగు, దిగుబడిలో ఏపీ ఇదే ట్రెండ్‌ ను కొనసాగిస్తోంది. 2018-19, 2019-20లో దేశవ్యాపిత విస్తీర్ణంలో ఏపీ వరుసగా 49.02, 48.66 శాతం, దిగుబడిలో 83.46, 81.77 శాతంతో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆయిల్‌ పామ్‌ సాగుకు దేశంలోనే అత్యంత అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. రైతులు కూడా సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్‌ ఆధారిత ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపటం ఆయిల్‌ పామ్‌ లో ఏపీ అగ్రస్థానంలో నిలబడటానికి ప్రధాన కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలో డిమాండ్‌కు మించి పండుతున్న వరికి బదులు ఇతర పంటలు పండిస్తే అధిక లాభాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు, సబ్సిడీలు, రుణాల రూపంలో ప్రోత్సాహకాలు అధికంగా ఉండటంతో రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెడుతున్నారు..1991-92లో కేవలం 8585 హెక్టార్లుగా ఉన్న సాగు విస్తీర్ణం 2020-21 నాటికి 3.7 లక్షల హెక్టార్లకు విస్తరించటమే రైతుల ఆలోచనా విధానంలో మార్పుకు సాక్ష్యమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

గోదావరి జిల్లాల్లో అత్యధికం

అధికారిక గణాంకాల ప్రకారం ఆయిల్‌ పామ్‌ సాగు జిల్లాల పునర్విభజనకు ముందు 8 జిల్లాల్లో విస్తరించి ఉండగా అందులో ఉభయగోదావరి జిల్లాల్లోనే అత్యధికంగా ఉంది. 2020-21లో రాష్ట్ర వ్యాప్తంగా 1,79,489 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ను సాగు చేస్తే.. అందులో 93835 హెక్టార్ల విస్తీర్ణం పశ్చిమ గోదావరిలోనే ఉంది. తూర్పు గోదావరిలో 34900, కృష్ణాలో 19514, విజయనగరంలో 14101, శ్రీకాకుళంలో 3958, నెల్లూరులో 4336, అనంతపురంలో 293 హెక్టార్ల విస్తీర్ణంలో అయిల్‌ పామ్‌ సాగవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement