Saturday, November 23, 2024

తగ్గేదేలే.. మీసం తిప్పిన ఆంధ్రా రొయ్య, ఆక్వాలో ఏపీ టాప్‌.. ఎగుమతుల్లో తొలి స్థానం

అమరావతి, ఆంధ్రప్రభ ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ అగ్రగామిగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల విస్తీర్ణం, విలువ, దిగుబడిపై సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రోత్సాహకం సంస్థ (మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-ఎంపెడా) తాజాగా నివేదిక వెల్లడించింది. ఆక్వా ఉత్పత్తుల దిగుబడి, ఎగుమతుల్లో ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్ర కన్నా మెరుగైన ఫలితాలు సాధించినట్టు నివేదికలో స్పష్టం చేసింది. గత ఏడాది 2021-22 ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఆరునెలల కాలంలో ఏపీ రూ 19 వేల కోట్ల విలువైన 18.46 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్టు ఎంపెడా తెలిపింది. దేశవ్యాప్తంగా ఎగుమతయిన ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ వాటా 31 శాతంగా ఉంది. ఏపీ తరువాత గుజరాత్‌ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా సుమారు 5.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నట్టు అంచనా. 2018-19లో 13.42 లక్షల టన్నులు, 2019-20లో 15.91 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తుల దిగుబడి రాగా 2020-21, 2021-22లో 18.5 లక్షల టన్నుల దిగుబడికి చేరువ కావటం ఏపీలో ఆ రంగం భవిష్యత్‌ కు ఉన్న మంచి అవకాశాలకు సంకేతంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆక్వా డెవలప్‌ మెంట్‌ అధారిటీని నెలకొల్పింది. ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ యాక్టు, ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్టును తీసుకొచ్చింది. రొయ్య పిల్లలు, మేత విషయంలో నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌, సవర) చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఖచ్చితంగా అధారిటీ ద్వారా లైసెన్సులు పొందిన వారే ఆక్వా సాగు చేపట్టాలని నిబంధన విధించింది. రాష్ట్రంలో సుమారు 5.5 లక్షల ఎకరాల ఆక్వా విస్తీర్ణం ఉండగా 1.2 లక్షల ఎకరాలకు ఇప్పటికే సాగుదారులు లైసెన్సులు పొందారు. మిగతా విస్తీర్ణంలోనూ లైసెన్సులు పొందాలని ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. లైసెన్సులు తీసుకుని ఆక్వా సాగు చేపట్టిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ప్రత్యేకించి ఆక్వా సాగుకు విద్యుత్‌ సబ్సిడీ కల్పించటం ఆ రంగంలోని వారికి ఎంతో ఊరట కలిగిస్తోంది. ఆక్వా చెరువులకిచ్చే విద్యుత్‌ సర్వీసులకు యూనిట్‌ కు రూ 1.50 పైసలను మాత్రమే వసూలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా యూనివర్శిటీ ఆ రంగంలోని పరిశోధనలకూ, నాణ్యమైన ఉత్పత్తుల దిగుబడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

అమెరికాకే ఎక్కువ..

ఏపీ నుంచి ఎగుమతవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో 57 నుంచి 60 శాతం అమెరికాకు ఎగుమతవుతున్నాయి. గతంలో చైనాకు కూడా ఎక్కువగా ఎగుమతి కాగా గడిచిన రెండేళ్ళుగా కొవిడ్‌ సంక్షౌభం కారణంగా తలెత్తిన సాంకేతిక ఇబ్బందుల వల్ల చైనాకు ఎగుమతులు సుమారు 30 నుంచి 20 శాతానికి తగ్గినట్టు అంచనా. అమెరికా, చైనా తరువాత దక్షిణ తూర్పు దేశాలకూ, యూరోపియన్‌ దేశాలకు కూడా ఏపీ నుంచి ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ప్రత్యేకించి ఏపీలో సాగవుతున్న వనామీ రొయ్యలకు విదేశాల్లో ఎక్కువ క్రేజ్‌ ఉంది. గడిచిన మూడేళ్ళుగా వనామీ రొయ్యల సాగులో ఏపీ అగ్రస్థానంలో ఉండగా ఎగుమతుల్లోనూ ఆ రొయ్యలదే హవా. ఎగుమతవుతున్న రొయ్యల్లో వనామీ రకం 74 శాతంగా ఉన్నట్టు అంచనా. రాష్ట్రంలో సుమారు 80 వేల హెక్టార్లలో వనామీ రొయ్యలు సాగవుతుండగా సుమారు 7.5 లక్షల టన్నుల దిగుబడి వస్తున్నట్టు అంచనా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement