సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరుకుటుంబాల మధ్య జరిగిన నేడు ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామంలోని ఎస్సీపేట చెరువు వద్ద కరాదాల పండు ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబీకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో కరాదాల, బచ్చల కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో కరాదాల ప్రకాశ్‌రావు(50)అక్కడికక్కడే మృతి చెందగా, చంద్రరావు(60), ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన బచ్చల చిన్నసుబ్బారావు, కరాదాల పండు, బాబీలు చికిత్స పొందుతున్నారు. ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.