Wednesday, September 18, 2024

AP మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం – వ్యాన్ ఢీ

మంత్రి సంధ్యారాణికి తప్పిన ప్రమాదం

బూసాయ వలసలో హైవేపై అనూహ్య ఘటన
ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొన్న ఐషర్
అయిదుగురు ఏఆర్ సిబ్బందికి తీవ్రగాయాలు
విజయనగరం ఆస్పత్రికి తరలింపు
క్షతగాత్రులకు జిల్లా ఎస్పీ పరామర్శ

( ఆంధ్రప్రభ స్మార్ట్, రామభద్రపురం/ విజయనగరం )
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కాన్వాయికి గురువారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా బూసాయ వలస గ్రామం సమీపంలో మంత్రి ఎస్కార్ట్ వాహనాన్ని ఐషర్ వ్యాన్ అతి వేగంగా ఢీకొట్టింది. ఎస్కార్ట్ వాహనంలోని ఐదుగురు ఏఆర్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అనూహ్య రీతిలో జరిగిన ఈ ప్రమాదం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి సంధ్యారాణి గురువారం ఉదయం సాలూరు నుంచి మెంటాడ మండలంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా… రామభద్రపురం మండలం బూసాయ వలస గ్రామం సమీపంలో ఐషర్ వాహనం ఆకస్మికంగా హైవే పైకి వచ్చి మంత్రి ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ఎస్కార్టు బృందంలోని ఐదుగురు సాయుధ పోలీసులు ఏఆర్ ఎస్ఐ కేవీ.రమణ, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పి.సునీల్, ఏఆర్ కానిస్టేబుల్ ఆర్.గణపతి, ఏఆర్ కానిస్టేబుల్ ఎం.మహేష్ , ఎస్కార్ట్ వాహన డ్రైవరు ఏ.వీ.వీ.ఎస్.ఎన్ .రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని విజయనగరం తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

క్షతగాత్రులకు ఎస్పీ పరామర్శ

ప్రమాదం సమాచారంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన పోలీసు సిబ్బందిని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ తిరుమల ప్రసాద్​తో ఎస్పీ మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా క్షతగాత్రుల్లో ధైర్యాన్ని నింపారు. అనంతరం, పోలీసుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆందోళన చెందవద్దని, అవసరమైతే ఇంకా మెరుగైన వైద్యం అందిస్తామని,. అవసరమైన వైద్య సాయం అందించేందుకు ఆసపత్రిలోనే వైద్యులకు అందుబాటులో ఉండాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి సంధ్యారాణి క్షతగాత్రులను అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స చేయిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement