Friday, September 6, 2024

AP – విద్యుత్ షాక్ తో దంప‌తులు మృతి… ముగ్గురు ఉద్యోగులు స‌స్పెండ్

విజయనగరం జిల్లాలో కరెంటు షాక్‌తో దంపతులు మరణించిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వేగంగా విచారణ జరిపిన ప్రభుత్వం విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించింది. దీంతో బాధ్యులైన ముగ్గురు విద్యుత్‌ అధికారులను సస్పెండ్‌ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. మెంటాడ గ్రామానికి చెందిన కోరాడ ఈశ్వరరావు శుక్రవారం ఉదయం తమ పొలానికి నీటిని మళ్లించేందుకు వెళ్లాడు. అయితే అక్కడ విద్యుత్‌ స్తంభాలు విరిగి విద్యుత్‌ వైర్లు పొలం కింద పడిపోయి ఉన్నాయి. వాటిని గమనించకుండా ఈశ్వరరావు నీటిని మళ్లించేందుకు వెళ్లగా కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో అక్కడికక్కడే కిందపడి మరణించాడు. పొద్దున ఎప్పుడో పొలానికి వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఆదిలక్ష్మి పొలానికి వెళ్లింది. అక్కడ విగతజీవిగా పడివున్న భర్తను లేపేందుకు వెళ్లి.. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై మరణించింది. అయితే ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

గత నెల 14వ తేదీనే విద్యుత్‌ స్తంభాలు విరిగి విద్యుత్‌ వైర్లు పొలంలో పడిపోయాయని.. దీనిపై స్థానిక లైన్‌మెన్‌కు చెప్పినా పట్టించుకోలేదని మెంటాడ గ్రామస్తులు మండిపడ్డారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే దంపతులు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేదాకా మృతదేహాలను తరలించేదే లేదంటూ మృతుల బంధువులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని వారికి సర్ది చెప్పారు.

కాగా, విద్యుత్‌ షాక్‌తో దంపతులు మృతి చెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకుంటుందని హామీ ఇచ్చిన ఆయన.. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. దీనికి బాధ్యులైన ముగ్గురు విద్యుత్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement