Friday, November 22, 2024

AP | ఫ్లెక్సిబుల్ రేట్ల విధానం తేవాలి.. ఉప ముఖ్యమంత్రితో గ్రంథి భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు, పూర్ణా పిక్చర్స్‌ ఎండీ గ్రంధి విశ్వనాథ్‌ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సినిమా టికెట్‌ ధరలు, ఓటీటీ ప్రభావం తదితర అంశాలపై చర్చించారు. పూర్ణా పిక్చర్స్‌ శత వసంతం సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా శ్రీ గ్రంధి విశ్వనాథ్ మాట్లాడుతూ…

‘‘ఓటీటీతో పాటు సినిమా టిక్కెట్ ధరల విషయంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సినిమా రంగాన్ని బతికించడానికి ఫెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే బాగుంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఈ అంశాన్ని పరిశీలించాల’’ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు విశ్వనాథ్‌ విజ్ఞప్తి చేశారు.

‘‘సినిమా టిక్కెట్లకు కనిష్ట, గరిష్ట రేట్లు ప్రకటిస్తే ఫ్లెక్సిబుల్ రేట్ల విధానంలో సినిమా స్థాయిని బట్టి ధరలను నిర్ణయించుకుంటారు. ఈ విధానంతో చిన్న సినిమాలకు కూడా మంచి కలుగుతుంది. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారు. అన్ని స్థాయిల చిత్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది” అని ఆయన వివరించారు. ఈ సూచనలు విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి ఈ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement