Monday, November 25, 2024

AP 18 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​ – పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలో ఈ నెల 18 నుంచి 30 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మండలస్థాయి అధికారులను సిద్ధం చేశారు. విద్యార్ధులకు పరీక్షలలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎప్పటికపుడు అప్రమత్తం చేస్తున్నారు. 7 రోజులు ప్రధాన సబ్జెక్టులు, 2 రోజులు ఓఎస్‌ఎస్‌సీ వృత్తి సంబంధిత సబ్జెక్టులలో తొమ్మిది రోజులపాటు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

3, 473 పరీక్షా కేంద్రాలు..
రాష్ట్రవ్యాప్తంగా 6,23,092 విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానుండగా వారిలో బాలురు 3,17,939 మంది, బాలికలు 3,05,153 మంది ఉన్నారు. వీరితో పాటు రీ అప్పీయర్‌ విద్యార్ధులు 1,02,528 మంది, ఓఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు 1,562 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3, 473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు- చేశారు.

ప్రత్యేక బృందాలు..
పరీక్షల్లో మాస్​ కాపీయింగ్​ జరగకుండా ఫ్ల్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్ల ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి డీఈవోలు అవసరమైన చోట సిట్టింగ్‌ స్క్వాడ్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. 682 సిట్టింగ్‌ స్క్వాడ్లు, 156 ప్లయింగ్‌ స్క్వాడ్లను సిద్ధం చేశారు. 130 కి పైగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పరీక్షలకు ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడెడ్‌ ప్రశ్న పత్రాలు అందించనున్నారు.

కంట్రోల్ రూం..
డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎస్‌ఎస్‌సీ బోర్డ్‌), విజయవాడలో 0866-2974540 ఫోన్‌ నంబర్‌ తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇది మార్చి1 నుంచి 30 వరకు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కంట్రోల్‌ రూములు డీఈఓల నుంచి 24 గంటల పాటు పనిచేస్తాయి. పరీక్షల అనంతరం స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపులు 31 నుండి 08వ తేదీ వరకు ఉమ్మడి 26 జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఎంపిక చేసిన వేదికలలో నిర్వహించనున్నారు.

ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధం
విద్యార్థులు, పరీక్ష సిబ్బంది పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అన్ని ప్రశ్నాపత్రాల నిల్వ, సరఫరా కేంద్రాలు, పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేస్తునానరు. పరీక్షా కేంద్రాలను సందర్శించడానికి మొబైల్‌ పోలీస్‌ స్క్వాడ్ల ను నియమించాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మెడికల్‌ కిట్లతో కూడిన ఏఎన్‌ఎం లను నియమించాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లందరూ అవసరమైనప్పుడు రెవెన్యూ, పోలీస్‌, పోస్టల్‌, ఏపీఎస్‌ఆర్‌టీసీ, ఏపీట్రాన్స్‌కో, మెడికల్‌, హెల్త్‌, ఏదైనా ఇతర శాఖల జిల్లా స్థాయిలోని ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్​ టికెట్లను ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌లలో చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement