నర్సీపట్నం, నవంబర్ 18 (ఆంధ్రప్రభ స్మార్ట్): మునిసిపాలిటీ కొత్త వీధిలో ఆదివారం అర్ధరాత్రి సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే యువకుడు హత్యకు గురికాబడ్డాడు. జరిగిన హత్య ఘటనతో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో మృతుని బంధువులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మృతుని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అధికారులు వెంటనే స్పందించాలని పట్టుపట్టారు. దీంతో కొద్దిసేపు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టౌన్ సిఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు మృతుని బంధువులకు చాలాసేపు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఒక గంట పాటు ఆందోళన జరిగిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు.
మద్యం మత్తులో జరిగిన హత్య : డీఎస్పీ మోహన్
హత్య జరిగిన తీరును నర్సీపట్నం డిఎస్పి మోహన్ ఘటన స్థలంలో వివరించారు. సర్వసిద్ధి నాగేశ్వరరావు (నాగు) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులను ఆదివారం రాత్రి తన ఇంటికి భోజనానికి పిలిచాడన్నారు. మున్సిపాలిటీ కొత్తవీధి వద్ద నాగేశ్వరావు ఇంటికి వెళ్లే మార్గంలో రౌడీ షీటర్ సంతోష్, కొండబాబు అనే నిందితులు మద్యం సేవిస్తూ నాగేశ్వరరావుతో గొడవ పడ్డారన్నారు. వెంట వచ్చిన స్నేహితులు నచ్చజెప్పి, నాగేశ్వరరావుని తీసుకొని ఇంటికి తీసుకు వెళ్లారని తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలో నాగేశ్వరావు స్నేహితులను బండి ఆపి, మళ్లీ ఎందుకు వస్తున్నారని రౌడీ షీటర్ బండారు సంతోష్ మెడపై సిగరెట్ తో కాల్చాడు. విషయం తెలుసుకున్న నాగేశ్వరావు ఆవేశంతో వారి వద్దకు వచ్చి గొడవ పడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంతోష్, కొండబాబు ఇద్దరూ చేసిన దాడిలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. సంతోష్ అనే నిందితుడును అదుపులో తీసుకున్నామని, పరారీలో ఉన్న కొండబాబు కోసం గాలిస్తున్నామని వివరించారు.