Wednesday, November 20, 2024

గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఏపీ, తెలంగాణ మెలికలు..

ప్ర‌భ‌న్యూస్ : కేంద్ర జలశక్తి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డులు చూపిస్తున్న శ్రద్ద తెలుగు రాష్ట్రాలకు ఉండటం లేదు. ఏపీ, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇంతవరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి రాలేదు. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో నీటి వాటాలపైనే రెండు రాష్ట్రాల మధ్య ప్రదానమైన వివాదం కావటంతో పాటు- గెజిట్‌ అమలును తామే కోరినందున ఏపీ ఒక అడుగు ముందుకేసి విద్యుత్‌ ప్రాజెక్టులను కలుపుకుని ఆరు కాంపొనెంట్లను అప్పగించేందుకు ఉత్వర్వులు జారీ చేసింది. క‌ట్టవిరగకుండా, పాము చావకుండా తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకున్న తరువాతనే తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా ప్రభుత్వం షరతు విధించింది. గోదావరి పరిధిలోని ప్రాజెక్టులను టేకోవర్‌ చేయాల్సి వచ్చినా అన్నింటినీ ఒకసారి తీసుకోవాలని కోరుతోంది. తెలంగాణ ఇంతవరకు ఆ ఊసే ఎత్తటం లేదు. దీంతో ఏపీ ఉత్తర్వులు జారీ చేసినా కృష్ణా బోర్డు ప్రాజెక్టులను కూడా స్వాధీనం చేసుకోలేకపోతోంది.

ఇక..గోదావరి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలు దాదాపు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. పెద్దవాగు తప్ప రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు అభిప్రాయ పడుతున్నాయి. కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల స్వాధీనంపై రేకెత్తుతున్న వివాదాలు సద్దుమణిగాక గోదావరి ప్రాజెక్టులపై స్పష్టత ఇచ్చేందుకు ఏపీ సిద్ధంగా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. పెద్దవాగు తప్ప గోదావరిపై ఏ ప్రాజెక్టును అప్పగించే ఉద్దేశ్యం తమకు లేదని తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ గోదావరి బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. తమ అనుమతి లేకుండా గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ ఎంబీ) ఉపసంఘం గోదావరి ప్రాజెక్టులను సందర్శించటం, గెజిట్‌ అమల్లో భాగంగా వాటి స్వాధీనానికి నివేదిక సిద్ధం చేసి కేంద్ర జలశక్తికి పంపించేందుకు ప్రయత్నించటంపై లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపసంఘంలో తాము సభ్యులుగా ఉన్నందున నివేదిక తయారీలో తమ భాగస్వామ్యం ఉండదని కూడా స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement