Friday, November 22, 2024

AP | 117 జీవో రద్దు చేసి మెగా డీఎస్సీ నిర్వహించాలి.. టీచర్స్‌ అసోసియేషన్‌ వినతి

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 50 వేలకు పైగానే ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయని ఈ నేపథ్యంలో 117 జీవోను రద్దు చేసి మెగా డీఎస్సీ ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హరికృష్ణ, శ్రీనివాసరావులు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.

2019కి ముందు రాష్ట్రంలో దాదాపు 15 వేల స్కూల్‌ అసిస్టెంట్‌లు, మూడు వేల పీజీటీలు, వెయ్యి ఎన్‌ఈవోలు అంతకుముందు మరో 25 వేల ఖాళీలు ఉన్నాయని ఇవన్నీ కలిపి దాదాపు 50 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. టోఫెల్‌ బోధన కోసం అదనంగా ఆంగ్ల ఉపాధ్యాయులు అవసరముందని ఈ నేపథ్యంలో కొత్త రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

ఖాళీలతో ప్రతి ఉపాధ్యాయుడిపై అదనంగా 20 శాతం పనిభారం పెరిగిందని ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూల్‌లలో విలీనం చేయడం ద్వారా 30 వేల మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ కేవలం 5 వేల మందికి మాత్రమే పదోన్నతులు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా ఖాళీ చేయాలని హరికృష్ణ, శ్రీనివాసరావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement