ఆర్డీవో ఆఫీసులో ఫైల్స్ దహనంపై చర్చ
పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడంపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం
ఈ కేసులో ఎవరున్నా వదిలే ప్రశక్తే లేదన్న మంత్రి అనగాని
(ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి) : మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై శాసన మండలి ఇవాళ అట్టుడుకింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును మంత్రి అనగాని సత్యకుమార్ ప్రస్తావనవకు తేవడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి పెద్దిరెడ్డి తొలగించాల్సిందేనని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. కేసు విచారణ ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారంటూ బొత్స మండిపడ్డారు.
కావాలని బురద జల్లవద్దు..
”కావాలని బురద జల్లే ప్రయత్నం చేయొద్దు.. మీకు చేతనైతే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోండి. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదు. రికార్డుల నుండి పెద్దిరెడ్డి పేరును తొలగించాలి” అని బొత్స అన్నారు. ఈ క్రమంలో పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలంటూ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు మంత్రి అనగానికి సూచించారు.
ఎవర్నీ వదిలేది లేదు..
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఎంతటి ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. దస్త్రాల దహనం వెనక ఉన్న కుట్రపై సీఐడీ దర్యాప్తులో ఉన్న అంశాలనే తాను ప్రస్తావించానని మంత్రి అనగాని తెలిపారు. ఈ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
పంట నష్టపరిహారం ఎక్కడ ..
శానస మండలిలో పంట నష్టపరిహారంపై కూటమి సర్కార్ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. గతంలో రైతులకు సమయానికి నష్టపరిహారం అందేదని.. కూటమి ప్రభుత్వం వచ్చిన రైతులకు సకాలంలో నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. 52 లక్షల మంది రైతులకు 10,500 కోట్లకు పైగా ఇవ్వాలని.. కానీ బడ్జెట్ లో 4500 కోట్లు పెట్టారన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. రైతులకు ఎప్పుడు నుంచి పెట్టుబడి సాయం అందిస్తారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రామససుబ్బారెడ్డి మాట్లాడుతూ, రైతులకు రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ కేంద్రంతో కలిపి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీ పోయింది కానీ, ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెబుతూ రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వ ఎప్పుడు ముందు ఉందని అన్నారు.. ఇప్పటి వరకు రైతులకు చేసిన సాయాన్ని గణాంకాలతో వివరించారు.