ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో – రాష్ట్రప్రభుత్వ తీరుతో నష్టపోయిన ప్రతీ యువకుడు తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తమ హక్కుల సాధనకు యువతరం అంతా ఏకం కావాలని, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పడాలని పిలుపునిచ్చారు. రూ.2,750 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ కిలారు విజయవాడ లోని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా కార్యాలయంలో ఈనెల 3న ప్రారంభించిన విద్యార్థి సంఘర్షణ ఆమరణ నిరాహార దీక్ష బుధవారం నాటికి 4వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి చేరుకున్న రామ్మోహన్ నాయుడు.. శ్రావణ్ కు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర యువత, విద్యార్థుల కోసం చేస్తున్న దీక్షను అభినందించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పిల్లల ఫీజులు కట్టులేని వాళ్లు విద్యార్థుల భవిష్యత్తును ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.
ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం..
లక్షలాది మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో యువత ఆకాంక్షలను చిదిమేయడమేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. మార్చి 1న విద్యా దీవెన పథకం నిధుల విడుదలకు బటన్ నొక్కారని గుర్తు చేశారు. అయితే ఏ ఒక్కరి ఖాతాలో డబ్బులు జమ కాలేదని స్పష్టం చేశారు. శ్రావణ్ చేపట్టిన దీక్షను స్ఫూర్తిగా తీసుకుని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యువత, విద్యార్థులతో కలిసి అన్ని జిల్లాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల కోసం పోరాటం చేస్తామని వివరించారు.