అంధ్రప్రభ, అమరావతి : కోట్లకు కోట్లు అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో కృష్ణాజిల్లా తాడిగడప మున్సిపాలిటీ అసిస్టెంట్ సిటీప్లానర్ ఇళ్లపై తిరుపతి ఏసీబీ అధికారులు అనూహ్యంగా దాడులు ప్రారంభించారు. ఈ దాడులపై అందిన సమాచారం ఇలా ఉంది. విజయవాడ సమీపంలోని అయ్యప్పనగర్లో ఆయన ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాడిగడప మున్సిపాలిటీ ఏసీపీ మురళి గౌడ్ గతంలో తిరుపతి కార్సొరేషన్లో ఇన్ చార్జి ఏసీపీగా పని చేశారు. ఆయన బదిలీపై విజయవాడ కార్పరేషన్ వచ్చారు. అదే సమయంలో అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు చుట్టుముట్టగా మురళీగౌడ్ తప్పించుకున్నారు.
అనంతరం తన పలుకుబడిని వినియోగించి తాడిగడన మున్సిపాలిటీలో ఇన్చార్జిగా విధుల్లో చేరారు. రెండు నెలల కిందటే ఏసీపీగా పదోన్నతి అందుకున్నారు. కాగా.. 14400 ట్రోల్ ఫ్రీకి మురళి గౌడ్ పై ఫిర్యాదులు పెరిగాయి. అవినీతి, అక్రమార్జనతో కోట్లకు కోట్లు కూడబెట్టారని ఫిర్యాదులు పెరగటంతో తిరుపతి ఏసీబీ అధికారులు మంగళవారం అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. మురళి గౌడ్ ఇంటిలో తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక కీలక పత్రాలు, నగదు, బంగారం దొరికినట్టు సమాచారం.