Tuesday, November 19, 2024

Ap: ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

వివ‌రాలు వెల్ల‌డించిన ఏఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా

ఆంధ్రప్రభ స్మార్ట్, చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో ఇద్దరు మావోయిస్ట్‌ పార్టీ సభ్యులు గురువారం చింతూరు ఏఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా ఎదుట లొంగిపోయారు. చింతూరు సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ కార్యాలయంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆంధ్రా సరిహద్దులోని చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుంట తాలూకా దంతెస్పురం గ్రామానికి చెందిన సీపీఐ మావోయిస్ట్‌ పార్టీ, కిష్టారం ఏరియా కమిటీ, 8 ఫ్లాటూన్ పార్టీ సభ్యుడు ముచ్చిక ఐత, కిండ్రెల్పాడ్‌ గ్రామానికి చెందిన కుంట ఏరియా కమిటీ, ఎల్‌వోఎస్‌ పార్టీ సభ్యురాలు మడకం హింగ లొంగిపోయారని తెలిపారు. ముచ్చిక ఐత 16వ ఏట కిష్టారం ఏరియా కమిటీ కమాండర్‌ మడకం జోగా ప్రోద్భలంతో మావోయిస్ట్‌ మిలీషియా సభ్యుడిగా మావోయిస్ట్‌ పార్టీలో చేరాడు. 2020 వరకు మిలీషియా సభ్యుడిగా పని చేశాడు. 2021లో కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడుగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2023 మే నెలలో సిల్గర్‌, కుందర్‌ మధ్య ఆకస్మిక దాడిలో, 2024 జూలై నెలలో ఈవోఎఫ్‌ దాడుల్లో పాల్గొన్నాడు. మడకం హింగ 2017లో మావోయిస్ట్‌ పార్టీలో చేరి శిక్షణ తీసుకుని ఎల్‌వోఎస్‌ సభ్యురాలిగా పని చేస్తోంది. ఈమె 2019 మే నెలలో కన్నాయి గూడెం ప్రజాకోర్టు నిర్వహించి ఇద్దరు విద్యార్ధులను హతమార్చిన ఘటనలో, 2023 మార్చి నెలలో మురళి గూడ గ్రామంలో వాహనాలు దహనం కేసులో 2018 ఆగస్టు నెలలో ఈవోఎఫ్‌ ఘటనలో, 2021 డిసెంబర్‌ నెలలో బందర్పదర్‌ వద్ద బలగాలపై కాల్పుల ఘటనలలో నిందితురాలు.ఈ కార్యక్రమంలో చింతూరు సీఐ దుర్గా ప్రసాద్‌, ఎస్ఐ పేరూరి రమేష్‌, సీఆర్పీఎఫ్‌ సీఐ ఎస్‌ మాత్స్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement