అమరావతి, ఆంధ్రప్రభ : పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ విడుదలు చేసిన జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించగా, అందులో 14 ప్రాజెక్టులతో ఏపీ ప్రథమ స్థానంలో నిలించింది. పరిశ్రమల్లో ఈ ప్రాజెక్టులు మున్ముందు అమలు చేయటం వల్ల వాటి ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడటంతో పాటు ఇంధనం ఆదా అవుతుంది, విద్యుత్, ఇతర ఇంధన వనరులపై చేసే వ్యయం తగ్గుతుంది. అలాగే పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కొంత మేర అరికట్టబడుతుంది.
ఇందు కోసం సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ ఆంధ్రప్రదేశ్‌కు హామీ ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు అమలుచేసే లక్ష్యంతో పెట్టుబడుల సదస్సులు నిర్వహించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లుగా విశాఖపట్నంలో ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసిఎం) ఈపెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో విశాఖపట్నంలో గత ఏడాది తొలి సదస్సు నిర్వహించిన అనంతరం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈతరహా సదస్సులు నిర్వహించింది. పారిశ్రామిక రంగంలో విద్యుత్, ఇతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు అమలు చేసే ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంగా పరిశ్రమలు, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చే కృషిలో భాగంగా ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించటం జరిగింది.
దేశంలో ఈ తరహా సదస్సు ఏపీలోనే
దేశంలో ఈ తరహా సదస్సు నిర్వహించటం గత ఏడాది నుంచి ప్రారంభం కావడంతో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులు అమలు చేసేందుకు పరిశ్రమలు క్రమంగా ముందుకొస్తున్నాయి. పరిశ్రమలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల మధ్య సమన్వయం కోసం బీఈఈ కొద్ది రోజుల క్రితం ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభించింది. ఇంధన సామర్ధ్య పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ఫెసిలిటేషన్ సెంటర్ ప్రత్యేక వెబ్ పోర్టల్ అదితిని అభివృద్ధి చేసింది. ఈ ఆన్ లైన్ పోర్టల్ పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడానికి బ్యాంక్ ఫైనాన్సింగ్ కోసం ఆన్ లైన్ ద్వారా అంగీకార పాత్రలను సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. సోమవారం ఈ పోర్టల్‌ను ఇండియన్ న్యూ ఢిల్లీలోని హాబీటాట్ సెంటర్ ఆవిష్కరించారు.
ఏపీకి రూ.400 కోట్లు
పెట్టుబడుల సదస్సు ద్వారా దేశవ్యాప్తంగా గుర్తించిన ఇంధన పొదుపు ప్రాజెక్టులకు రూ.2,500 కోట్లు పెట్టుబడి వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు- బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసీఎంసీ(బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తెలిపారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 14 ప్రాజెక్టులు గుర్తించగా, వీటికి రూ.400 కోట్లు పెట్టుబడి వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు సిమెంట్, స్టీల్, పవర్ ప్లాంట్లు, ఫర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందినవని తెలిపారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులు ఇంకా పరిశీలన దశలో ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య సాంకేతిక ప్రాజెక్టులు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈప్రాజెక్టులు అమలు చేయడంవల్ల పరిశ్రమల్లో విద్యుత్, ఇతర వనరులను మెరుగ్గా వినియోగించుకునే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. దీనివల్ల విద్యుత్ ఆదా అవడంతో పాటు పరిశ్రమల నిర్వహణ వ్యయం కూడా కొంత మేర తగ్గుతుందన్నారు. అలాగే నాణ్యమైన ఉత్పత్తిని సాధించడం, ఉత్పాదకత మెరుగుపడటం జరుగుతుందన్నారు. విద్యుత్, ఇతర ఇంధన వనరుల వినియోగం కొంతమేర తగ్గడం వల్ల పరిశ్రమల కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.
పరిశ్రమలకు దీర్ఘకాలిక ప్రయోజనం
ఇంధన సామర్ధ్య సాంకేతికతను వినియోగించుకోవటం వల్ల పరిశ్రమలు దీర్ఘ కాలంలో పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతాయన్నారు. అంతిమంగా ఇది పారిశ్రామిక విస్తరణకు, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు కూడా దోహద పడుతుందని పేర్కొన్నారు. ఇంధన సామర్ధ్య ప్రాజెక్టుల అమలులో చురుకుగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందిస్తునట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ అంతా ఇంధన సామర్ధ్య రంగానిదేనని పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇందుకోసమే పరిశ్రమల్లో ఇంధన సామార్ధ్యాన్ని పెంపొందించేందుకు పెధ్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు 5శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ పోర్టులను ప్రారంభించిన అనంతరం, దేశ వ్యాప్తంగా గుర్తించపడిన ఇంధన సామర్థ్య ఫైనాన్సింగ్ ప్రాజెక్టులు, వాటి పెట్టుబడులు, ప్రాజెక్ట్ ఖర్చులను సంబంధించి ఒక నివేదికను ఏపీఎస్ఈసిఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ చంద్రశేఖర రెడ్డితో డీడీజీ బీఈఈ అశోక్ కుమార్ పంచుకున్నారు.
ప్రభుత్వ ప్రతిష్టే కారణం
ఇంతమంది భాగస్వాములు ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలుకు, రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడానికి ప్రభుత్వ ప్రతిష్టే కారణమని ఇంధన పరిరక్షణ మిషన్ సిఈఓ చంద్రశేఖర రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలుకు సహకారం అందిస్తునందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఈఈ మరియు డీడీజీ బీఈఈకి సిఈఓ ఏపీఎస్ఈసిఎం కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు ద్వారా దాదాపు రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయటం జరిగిందన్నారు. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించగలిగామని తెలిపారు. పగటి పూటే రైతాంగానికి 9 గంటల కరెంటు సరఫరా చేస్తూనే, ముఖ్యంగా పరిశ్రమలకు, గృహాలకు దీర్ఘకాలం పాటు 24/7 నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి ప్రశంసనీయమన్నారు.