( ఆంధ్రప్రభ స్మార్ట్, నూజివీడు) ఎన్నికల బెట్టింగ్ ఊబిలో ఓ వైసీపీ నాయకుడు బలయ్యారు. అధికార పార్టీ విజయం ఖాయమని వైసీపీ నాయకుల పందేల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన ఈ నాయకుడు అత్యాశతో తన చేతికి వచ్చిన సొమ్మును మరో పందెంలో కాసి దెబ్బతిన్నాడు. ఈ స్థితిలో గెలిచిన వ్యక్తులకు సొమ్ము ఇవ్వలేక అజ్ఞతంలోకి చేరుకున్న ఈ వ్యక్తి అనూహ్యంగా తన ఫార్మ్ హౌస్ లో శవంగా ప్రత్యక్షం కావటంతో.. ఏపీలో సంచలనం రేపింది.
తెలుగుదేశం పార్టీ నేతల హత్య చేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘోర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తరఫున బెట్టింగ్ లు నిర్వహించారు. 10 శాతం కమీషన్ పై వేణుగోపాల్ రెడ్డి సుమారు రూ. 30 కోట్ల వరకు బెట్టింగ్ సొమ్మును సేకరించారు. మంచి వ్యక్తి , సౌమ్యుడిగా, నిక్కచ్చి వ్యక్తిగా పేరొందిన వేణుగోపాల రెడ్డిని బెట్టింగ్ మధ్యవర్తిగా నమ్మారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటంతో పందెంలో గెలిచిన వ్యక్తులు డబ్బుల కోసం వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ నెల నాలుగో తేదీన ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత వేణుగోపాల్ రెడ్డి గ్రామంలో కనిపించలేదని గ్రామస్తులు తెలిపారు.
ఇటీవల పందెం రాయుళ్లు తమ సొమ్ములు తమకు చెల్లించాలని వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. భీమవరం నుంచి వచ్చిన వ్యక్తులు ఏకంగా ఇంట్లో సామానులను తమ వాహనాల్లో తరలించుకు పోయారని ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఉదయం గ్రామంలో ని వేణుగోపాల రెడ్డి ఫామ్ హౌస్ లో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహం కనిపించటంతో గ్రామంలో కలకలం రేగింది. ఉలిక్కిపడిన గ్రామస్తులు తక్షణమే నూజివీడు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పందెంరాయుళ్లే వేణుగోపాల రెడ్డిని చంపి ఫామ్ హౌస్ లో పడేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు. ప్రస్తుతం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.