కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం , స్వచ్ఛంద సంస్థలు పరస్పరం సహకరించుకోవాలని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులతో సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సంబంధితులందరికీ సమాచారం అందించాలని, ప్రభుత్వ సేవల్ని ప్రజలకు చేర్చటంలో స్వచ్ఛంద సంస్థలు వారధిగా వ్యవహరించాలన్నారు. కోవిడ్ బాధిత కుటుంబాలకు మానసిక, సామాజిక మద్దతును అందించాలన్నారు. ప్రభుత్వం అనుమతించిన ప్రచార సామగ్రినే వాడుకోవాలని సూచించారు. ఐసొలేషన్, వ్యాక్సినేషన్, టెస్టింగ్ కేంద్రాల నిర్వహణా బాధ్యతల్ని ఎన్జీవోలు స్వీకరించాలన్నారు.
సంచార వాహనాల ద్వారా చిన్నారులు, వృద్ధులకు వారి వారి ఇళ్ల వద్దే కోవిడ్ టెస్టింగ్ సేవల్ని అందించాలన్నారు. అనాధ బాల బాలికలలకు వేర్వేరుగా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ వల్ల అనాధలైన చిన్నారులకు ప్రభుత్వం రు.10 లక్షలు డిపాజిట్ చేసి, అండగా వుండేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుత కోవిడ్ సమయంలో బ్యాంకుల వద్ద రద్దీని నివారించేందుకు రుణాల రెన్యువల్ గడువును పొడిగించేలా బ్యాంకుల యాజమాన్యాలతో సంప్రదిస్తోందని జవహర్ రెడ్డి వివరించారు.