★ప్రారంభించిన హోంమంత్రి అనిత
★ప్రజల వెసులుబాటు కొరకు ప్రభుత్వం రూపొందించిన సింగిల్ విండో క్లియరెన్స్ విధానం
★7995095800 మొబైల్ నంబర్ కు వాట్సాప్ ద్వారా హై అని సందేశం పంపిస్తే సరి
విశాఖ క్రైం : ప్రభ న్యూస్ : వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మంటపం ఏర్పాటు చేసే ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకు రావడం జరిగింది.
ఇంతకు ముందు వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ, పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (ఎన్ ఓ సి) పత్రం తీసుకోవలసి ఉండేది.
దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానంరూపొందించినది.
ఇందులో భాగంగా ప్రజలు 7995095800 మొబైల్ నంబర్ కు వాట్సాప్ ద్వారా హై అని సందేశం పంపిస్తే చాలు, నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్ కు వస్తుంది.
ఆ తరువాత ప్రజలు ganeshutsav.net అనే వెబ్సైట్ లో గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకివస్తుంది, విగ్రహం ఎత్తు, మంటపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయం లో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి వెళ్తుంది. ఎస్.హెచ్.ఓ ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్ని మాపక శాఖ , విద్యుత్ శాఖల యొక్క సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మంటపం ఏర్పాటు చేయు ప్రదేశమును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే క్యూ ఆర్ కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు.
అనుమతికి అవసరం అయిన రుసుము వివరాలు తెలియచేస్తారు. ప్రజలు వారికి దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రము నందు తగిన రుసుమును చెల్లించి ఆ రసీదును వెబ్సైట్ లో అప్లోడ్ చేసినయెడల ఎస్.హెచ్.ఓ వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర పత్రమును జారీ చేస్తారు.
ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచవలెను. పోలీసువారు సందర్శన సమయములో క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.
ఇక , సింగిల్ విండో పోర్టల్ ను హోంమంత్రి అనిత నేడు ప్రారంభించారు