సహ ఉద్యోగిపై లైంగిక వేధింపులు
పోలీసులకు అందిన ఫిర్యాదు
చిన్న కేసుతో తప్పించాలని పోలీసుల యత్నం
భగ్గుమంటున్న మహిళా సంఘాల ప్రతినిధులు
విశాఖ క్రైం, (ప్రభ న్యూస్) : మహిళ ఉద్యోగిపై ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన విశాఖలో సంచలనంగా మారింది. ఆమె విధి నిర్వహణలో ఉండగా తన కేబిన్ లోకి పిలిపించుకొని తాకరాని చోట తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో అధికారి. ప్రతిఘటించినప్పటికీ భౌతిక దాడికి పాల్పడుతూ.. కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే తనను ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ ఘటన విశాఖ మత్స్యశాఖలో సంచలనంగా మారింది.
షిప్పింగ్ హార్బర్‌లో అకృత్యాలు..
షిప్పింగ్ హార్బర్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ అకృత్యాలు బాధిత మహిళ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా వెలుగుచూసాయి. పెందుర్తి, చినముసిడివాడ, గణేష్ నగర్లో నివాసం ఉంటున్న బాధితురాలు విశాఖ సిటీ మత్స్య శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఈనెల 9న ఆమెకు టర్న్ డ్యూటీ కేటాయించారు. దానికోసం రెండు గంటల ముందు అనుమతి తీసుకున్న తర్వాత కార్యాలయానికి హాజరైంది. అయితే.. మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ లాల్ మహ్మద్ తన కేబిన్‌లోకి పిలిపించుకొని లైంగికంగా వేధించినట్టు పోలీసులకు అందిన ఫిర్యాదులో తెలిపింది. అతను గతంలో కూడా చాలాసార్లు తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. అతని పట్ల సీరియస్ కావడంతో ఈ విషయం ఎవరికైనా చెప్తే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించాడని తెలిపింది. ఈనెల 11న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తనపై జరిగిన లైంగిక వేధింపులు గురించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చిన్న సెక్షన్లతో నిందితుడిని తప్పించేందుకు పోలీసుల స్కెచ్..?
చిన్న సెక్షన్లతో నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని మహిళా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మహళా ఉద్యోగి పట్ల మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆఫీస్ కేబిన్ కు పిలిపించి ఆమెపై అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడితే మరీ చిన్న సెక్షన్లతో అతడిని తప్పించాలనే ప్రయత్నం సరైంది కాదన్నారు.