Monday, September 16, 2024

APలో మ‌రో ఏడు కొత్త విమానాశ్ర‌యాలు….

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – ఏపీలోని ఏడు విమానాశ్రయాలను 14కు విస్తరించాలనేదే తన లక్ష్యమని పౌర విమాన‌యాన శాఖ కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు . ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఎపి సిఎం చంద్ర‌బాబు నేటి ఉద‌యం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. , ఆ శాఖ మంత్రి , శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ప్రతిపాదనలపై అధికారులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనంత‌రం రామ్మోహ‌న్ మాట్లాడుతూ,ఎపిలో విమాన స‌ర్వీస్ లు పెంచుతామ‌ని, ద్వితీయ ప‌ట్ట‌ణాల నుంచి కూడా త్వ‌ర‌లో స‌ర్వీస్ లు ప్రారంభిస్తామ‌ని చెప్పారు..

రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్‌ సామర్థ్యం పెంపు పనులపై సీఎం తో సమీక్ష చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని తెలిపారు. ఏపీలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే తమ శాఖ తరఫున సహకారం అందిస్తామన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు గుర్తించినట్టు మంత్రి వివరించారు. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్‌లో సీ ప్లేన్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయంలో విమానయానశాఖ, రాష్ట్రప్రభుత్వం కలిసి ముందుకెళ్తాయన్నారు. విమానాశ్రయాల్లో మౌలికసదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కొత్త ప్రాంతాల్లో భూమి, సాంకేతిక అంశాలు పరిశీలిస్తామన్నారు. పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు సీఎంతో చర్చించినట్టు తెలిపారు. ప్రైవేటు విమానాశ్రయ నిర్వాహకులతో చర్చించాల్సి ఉందన్నారు. పౌరవిమానయాన సంస్థగా మారిస్తే సాధారణ కార్యకలాపాలు సాగించవచ్చన్నారు. ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా చేయాలనేది చంద్రబాబు ఆలోచన అని, లాజిస్టిక్‌ హబ్‌గా చేయడంలో విమానాశ్రయాల పాత్ర కీలకమన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement