Tuesday, November 12, 2024

AP స్కూల్ ఎడ్యుకేష‌న్‌ సూప‌ర్‌! మ‌న విద్యా విధానంపై ఆస‌క్తి

ఏపీపై దృష్టిసారించిన ఇత‌ర రాష్ట్రాలు
జాతీయ స్థాయిలో ఏపీకి అగ్ర‌స్థానం
స్వదేశీ, విదేశీ ప్రతినిధుల వరుస పర్యటనలు
విద్యా విధానాలు, సంక్షేమ పథకాలపై ఆరా
త‌మిళ‌నాడు విద్యాశాఖ సంచాల‌కుల రాక‌
జాంబియా, మెక్సికో దేశాల ప్ర‌త‌నిధుల ప‌రిశీల‌న‌
తమ ద‌గ్గ‌రా అమలు చేస్తామంటూ ప్రశంసలు
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి చాటుతున్న పాఠశాల విద్య

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్య నుంచి విద్యార్ధులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అనేక సంస్కరణలు చేపడుతోంది. సీఎం జగన్‌ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. నాడు నేడు వంటి బృహత్తర కార్యక్రమంలో ఇప్పటికే అనేక పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రూపాంతరం చెందాయి. వీటితో పాటు.. నాడు నేడు ఫేజ్‌లో భాగంగా పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను, సకల వసతులను ఏర్పాటు చేశారు. బోధనా వ్యవస్థలోను విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకుంటూ నాణ్యమైన బోధన అందిస్తున్నారు. ఏపీ విద్యార్ధులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో మరికొన్ని సంస్కరణలు చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో పాటు విదేశీ ప్రతినిధులు ఏపీలో అమలు చేస్తున్న విద్యా విధానాలకు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రవాప్తంగా ఉన్న పాఠశాలల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా విధానాలపై ఆరా తీస్తున్నారు. ఏపీలో చేపడుతున్న సంస్కరణలను మెచ్చుకుంటూ తమ విద్యా వ్యవస్థలోనూ అమలు చేస్తామంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జాతీయ స్థాయిలో ఏపీకి అగ్రస్థానం

ఈ నేపథ్యంలోనె కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2021 – 22 రాష్ట్రల విద్యా వ్యవస్థ పనితీరు గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో ఏపీకి అగ్రస్థానం దక్కింది. 73 అంశాలకు వెయ్యి పాయింట్ల ఆధారంగా కేంద్రం గ్రేడింగ్‌ ఇవ్వగా, 902 పాయింట్లతో ఏపీ అగ్రస్థానం దక్కించుకుంది. లెర్నింగ్‌ అవుట్‌కమ్‌లు (ఎల్‌వో), యాక్సెస్‌ (ఏ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఫెసిలిటీస్‌ (ఐఎఫ్‌), ఈక్విటీ (ఈ), గవర్నెన్స్‌ ప్రాసెస్‌ (జీపీ), టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ అనే ఆరు అంశాల ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చారు.

ఏపీ విద్యా సంస్కరణలపై తమిళనాడు ఎస్పీడీ ఆరా

తమిళనాడులో విద్యాభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలు అమలు.. అధ్యయనంలో భాగంగా తమిళనాడు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎం.ఆరతి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలపై ఆరా తీశారు. ఇటీవల తిరుపతి జిల్లా రేణిగుంట జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల ప్లస్‌ను సందర్శించి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు పరిశీలించారు. రాష్ట్రంలోని తీసుకొచ్చిన నూతన ఆవిష్కరణలు, ఐసీటీ (ఇన్ఫర్మెషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీ), ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్‌, ట్యాబులు వాడకం, బైజూస్‌ కంటెంట్‌, పాల్‌ (పర్సనలైజ్డ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌ సొల్యూషన్‌) ల్యాబ్‌ వినియోగం, జగనన్న నవరత్నాలు, జగనన్న విద్యాకానుక క్వాలిటీ వాల్‌, బైలింగువల్‌ బుక్స్‌, మధ్యాహ్న భోజన పథకం, స్వేచ్ఛ, టోఫెల్‌, మన బడి.. నాడు నేడులో భాగంగా పాఠశాల మౌలిక వసతుల కల్పన వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటిని తమిళనాడులోను అమలు చేస్తామ‌ని ఆరతి తెలిపారు.

- Advertisement -

ప్రశంసించిన జాంబియా దేశ అధికారులు

ప్రాథమిక విద్యలో నాణ్యత పెంపొందించడం కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, తరల్‌ అమలు తీరు బాగున్నాయని జాంబియా విద్యాశాఖ ప్రతినిధులు కొనియాడారు. జాంబియా దేశానికి చెందిన ప్రాథమిక విద్య డైరెక్టర్‌ కెల్లీ కేజాలా మ్వాలే, తరల్‌ ఆఫ్రికా, వీవీవోబి సంస్థల మధ్య ప్రభుత్వ లైజన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న హజెంబా, టీచర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పెషలైజ్డ్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆంటోని టంబాటంబా, కంట్రీ ప్రొగ్రామ్స్‌ మేనేజర్‌ కరోలిన్‌ మేరీ ఇలియట్‌లు ఇటీవల కాలంలో బాపట్ల జిల్లాలో వివిధ పాఠశాలలను బృందాలుగా సందర్శించారు.

బాప‌ట్ల మండ‌లంలో ప‌ర్య‌ట‌న‌లు..

బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెం మండల పరిషత్‌ పాఠశాల సందర్శించారు. పేరెంట్స్‌ కమిటీ సభ్యులతో మాట్లాడి పాఠశాల, విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. తమ దేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాల అమలు చేస్తామని జాంబియా ప్రతినిథులు చెప్పారు. బాపట్లలో ప్రథమ్‌ నిర్వహిస్తున్న స్కిల్ ట్రైనింగ్‌ సెంటరును సందర్శించి వృత్తి విద్యలో భాగంగా హోటల్‌ మేనేజ్‌ మెంట్‌ కోర్సు చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. వారికి నేర్పించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉంటే జాంబియా దేశంలో ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ బృందంలో కొంతమంది బాపట్ల మండలంలోనే శివపురం, చింతాయపాలెం, చెరువు జమ్ములవారి పాలెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు సందర్శించి మన బడి నాడు -నేడు, జగనన్న గోరుముద్ద, కమిటీ, ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెళ్లు వంటివి పరిశీలించి, విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న గుణాత్మక కార్యక్రమాలను గున్నాయని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు తమ దేశంలో అమలు చేస్తామన్నారు.

డిజిటల్‌ బోధన భేష్‌.. అభినందించిన ఐబీ ప్రతినిధి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు అందింస్తున్న డిజిటల్‌ బోధన అద్భుతంగా ఉందంటూ మెక్సికో దేశానికి చెందిన ఐబి (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) ప్రతినిధి ఆల్డో కొనియాడారు. ఈ నెల మొదటి వారంలో నాలుగు రోజుల పాటు కృష్ణా జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించారు. ఆల్డో తన పర్యటనలో భాగంగా తొలుత కృష్ణా జిల్లాలోని ఎంకే బేగ్‌ మున్సిపల్‌ పాఠశాలను సందర్శించారు. తరగతి గదులను సందర్శించి, ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెళ్ల వినియోగాన్ని, బోధనా కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

జ‌గ‌న‌న్న గోరుముద్ద రుచి చూసిన విదేశీ ప్ర‌తినిధులు

‘జగనన్న గోరుముద్ద’ను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. కంకిపాడు మండలం పునాదిపాడులో భౌతిక శాస్త్ర, జీవ శాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ లాబ్‌, ఈడుపుగల్లులో డ్రాయింగ్‌ ప్రదర్శన, సైన్స్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. వీటి వినియోగం పట్ల ఆల్డో ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్‌ విధానం గురించి ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల వివరాలను, చేరే విధానాన్ని, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యాసన పద్దతులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement