పొలవరాన్ని వదిలేశారు
అమరావతిని పక్కన పెట్టారు
అందుకే జనం బుద్ది చెప్పారు
ప్యాలెస్ టూ ప్యాలెస్ లీకులెందుకు
ఇక తాడేపల్లికి రానంటున్నారు
శాంతిపై ఆరోపణలు రావడంతోనే సస్పెండ్
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్
( ఆంధ్రప్రభ స్మార్ట్, నెల్లూరు ప్రతినిధి) – ఎపీలో అయిదేళ్ల విధ్వంస పాలనకు ప్రజలు బుద్ది చెప్పారని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని, రాజధాని లేని రాష్ట్రంగాఏపీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాన్ని అప్పటి సీఎం జగన్ మరచిపోయారని, సచివాలయానికి సీఎం రాకపోతే మంత్రులు ఎలా వస్తారని ఆనం ప్రశ్నించారు. నిర్మాణాలు ఎక్కడ నిలిచిపోయాయో.. ఇవాళ్టికి అక్కడే ఉన్న పరిస్థితి నెలకొందని , నిలిచిన నిర్మాణ పనులన్నీ మళ్లీ మొదలుపెట్టే పనిలో ఉన్నామని మంత్రి ఆనం వివరించారు. కాలం గడిచిన కొద్దీ నిధుల వ్యయం కూడా పెరిగిన పరిస్థితి ఉన్నప్పటికీ అమరావతి నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతాయన్నారు.
అంతా విధ్వంసమే
విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా వేల కోట్ల నష్టం మిగిల్చారని, జగన్ అనుయాయులకు వేల ఎకరాలు కట్టబెట్టి వేల కోట్లు దోచుకున్న పరిస్థితి చూశామన్నారు. రాష్ట్ర ప్రజల సంపదను ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఈ రోజు శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేకుండా చేశారని, ప్రశ్నిస్తే దాడులకు తెగబడి బెదిరించారని, అందుకే అయిదేళ్లపాటు సాగిన విధ్వంస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి ఆనం వివరించారు.
ఆరోపణలు రావడంతోనే శాంతి సస్పెండ్
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆరోపణలు రావడంతో ప్రాధమిక విచారణ జరిపి సస్పెండ్ చేశామని, ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతున్నదని ఆనం చెప్పారు. ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసారెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్, శాంతిల పాత్ర ఉందని సమాచారం అందిందన్నారు.
ఇక తాడేపల్లి ప్యాలెస్ కు రాడు
తొలిసారిగా మాజీ సీఎం జగన్ పై మంత్రి ఆనం పర్సనల్‌గా ఎటాక్ చేశారు. తాను ప్యాలెస్ టు ప్యాలెస్‌కు వెళ్తున్నారని మీడియాకు లీక్‌లిస్తే అందులో ఏమంటుంది? అని ఆనం ప్రశ్నించారు. సొంత ప్యాలెస్‌లకు వెళ్తున్నావని, ప్యాలెస్ నుంచి పూరి గుడిసెకు వస్తే చెప్పుకోవచ్చారు. ఒక ప్యాలెస్‌కు వెళ్లాలని ప్లాన్ చేశావని, ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం వల్ల వెళ్లలేక పోయావన్నారు దేవాదాయశాఖ మంత్రి. సింహాచలం లక్ష్మీనరసింహాస్వామి వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీలో ఇవాళ ఉన్న పరిస్థితి వల్ల తాడేపల్లి ప్యాలెస్‌కు రావని రాజకీయ విశ్లేషకుల ఆలోచనగా చెప్పుకొచ్చారు.