ఏపీలో చాలా రోజుల తర్వాత నెల మొదటిరోజే ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల ప్రారంభంలోనే జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసినసంక్షేమ పథకాల కారణంగా.. తొలి రోజే ఉద్యోగులకు జీతాలు వేయలేని పరిస్థితి ఉండేది. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా అప్పట్లో నిరసన తెలిపాయి. అయితే వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీలో ఉద్యోగులకు నెల తొలిరోజే జీతాలు జమవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పడుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రేపటిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఒకటో తేదీ ఉదయం నుంచి జీతాలు చెల్లింపు ప్రారంభం అయ్యాయి. సరిగ్గా ఒకటో తేదీన జీతాలు పడటంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు పడుతుండటంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.