Tuesday, November 19, 2024

ప‌ల్లె రోడ్లు..ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌వా?

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రోడ్ల మరమ్మతులు, ఆధునీకరణ పనులను ఓ సవాల్‌గా తీసుకుని ఆయా శాఖలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారు. దశలవారీగా రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఉన్నత శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను సుందరీకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అయితే, రహదారుల ఆధునీకరణ తాత్కాలిక మరమ్మతులు పట్టణ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులకే పరిమితమ వుతున్నాయి. పల్లెల్లో చుద్దామన్నా రోడ్ల మరమ్మతులు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కొన్ని గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ఆపనులు సుదీర్ఘకాలం సాగుతూనే ఉన్నాయి. కేవలం 20 నుండి 30 శాతం మాత్రమే పల్లె రోడ్లు మరమ్మతులు చేస్తున్నారే తప్ప మిగిలిన 70 శాతం రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు మా పల్లె రహదారులు ఏం పాపం చేశాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరికొన్ని గ్రామీణ ప్రాంతాల్లో
ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పట్టుబట్టి రింగు రోడ్లను ఆధునీకరించేందుకు దృష్టిసారిస్తున్నా నిధుల కొరతతో కొన్ని రహదారుల మరమ్మతు పనులను మధ్యలోనే నిలిపివేస్తున్నారు.


దీంతో పలు గ్రామాలను కలిపే రింగు రోడ్లలో ప్రయాణం చేయాలంటేనే గ్రామీణ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తోంది. వీటికి తోడు గత ఏడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామీణ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆసమయంలోనే దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి శాశ్వత మరమ్మతులకోసం ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులు రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈమేరకు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులకు సంబంధించి మూడు కేటగిరీల్లో వేర్వుగా ప్రతిపాదనలు తయారుచేయడం, అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 2,600 కోట్లకుపైగా నిధులను కేటాయించింది. అయితే, ఆనిధులతో పట్టణ ప్రాంతాలు, రాష్ట్ర రహదారుల్లోని కొన్ని ప్రాంతాల్లో శాశ్వత మరమ్మతులు చేపట్టినప్పటికీ గ్రామీణ రహదారుల విషయంలో అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఫలితంగా పల్లె రహదారుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

రాష్ట్రంలో..70 శాతంపైగా..ఇదే పరిస్థితి :
రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల రహదారులను పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులను ఇప్పటికే దాదాపుగా 80 శాతం పైగా మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టారు. దీంతో పలు జిల్లా స్థాయి రహదారులకు కొత్త కళ సంతరించుకుంది. అయితే, ఆయా జిల్లా రహదారుల నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రింగు రోడ్లు, మండల కేంద్రాల నుండి పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారుల విషయంలో మాత్రం సంబంధిత శాఖలు ఆస్థాయిలో ప్రత్యేక దృష్టిని సారించడం లేదు. ఫలితంగానే రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులకు కొత్త శోభ కనిపిస్తున్నప్పటికీ పల్లె రహదారుల విషయంలో దాదాపుగా 70 శాతంపైగా రోడ్లు అధ్వాన్నంగానే దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో దెబ్బతిన్న రహదారులకు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో సాధారణంగా కిమీ దూరం గమ్యాన్ని వాహనంపై మూడు నాలుగు నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతంపై 70 శాతం పల్లెల్లో దెబ్బతిన్న రహదారుల్లో కిమీ ప్రయాణం చేయాలంటే 10 నుండి 15 నిమషాలకుపైగా సమయం పడుతుందంటే పల్లె రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అధికారులు మాత్రం ప్రధాన రహదారులకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామీణ రహదారులను మొక్కుబడిగా మరమ్మతులుచేసి మమ అనిపిస్తున్నారే తప్ప రాష్ట్రవ్యాప్తంగా శిధిలావస్తలో ఉన్న పల్లె రహదారులను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు దృష్టి సారించడం లేదు.

ఈ రహదారుల్లో ప్రయాణమంటే నరకం :
రాష్ట్రంలో పల్లె రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే అమరావతి రాజధాని గుంటూరు జిల్లాలోని ప్రధాన మార్గానికి కూత వేటు దూరంలో ఉన్న పల్లె రహదారులను ఒక సారి పరిశీలిస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చుండూరు నుండి మోదుకూరు వెళ్లే ప్రధాన మార్గం గత దశాబ్ద కాలంగా అధ్వాన్నంగా ఉంది. రెండున్నర కీమీ పొడవు గల ఈ రహదారిపై ప్రతి 10 అడుగులకు రెండు మూడు గోతులున్నాయంటే ఈ రోడ్డు ఎంత అందంగా ఉందో మరమ్మతులు చేపట్టి ఎంతకాలమైందో ఒక్కసారి పరిశీలిస్తే అర్ధమౌతుంది. అయితే, ఇదే మార్గానికి సంబంధించి శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచి మరమ్మతు పనులను కాంట్రాక్టరుకు అప్పగించింది. అయితే, చుండూరు నుండి మోదుకూరు వెళ్లే గ్రామీణ రహదారుల్లో గురుకుల పాఠశాల వరకూ సుమారు కిలో మీటరు మేర రహదారిని పూర్తిస్థాయిలో మరమ్మతులుచేసి ఆధునీకరించారు. గురుకుల పాఠశాల సమీపం నుండి మోదుకూరు వరకూ పాత రోడ్డును అలాగే వదిలేశారు. గతంలో ఉన్న గోతులను తవ్వి చదునుచేశారే తప్ప తారోడ్డు పనులను మాత్రం మధ్యలోన వదిలేశారు. దీంతో మోదుకూరు గ్రామం ఏం పాపంచేసిందంటూ ఆప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే, పొన్నూరు నుండి పెదనందిపాడు మీదుగా వల్లూరు వెళ్లే మార్గమైతే వర్ణించడానికి కూడా వీల్లేదు. సంవత్సరాల తరబడి ఈ మార్గం మరమ్మతులుకు కూడా నోచుకోలేదు. అదేవిధంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మీదుగా మైపాడు వెళ్లే గ్రామీణ రహదారి గోతులతో అధ్వాన్నంగా దర్శనమిస్తోంది. అలాగే, నెల్లూరు నుండి కొరుటూరు వెళ్లే రహదారి కూడా పూర్తిగా దెబ్బతింది. అలాగే ఆత్మకూరు నుండి నందిపాడు మీదుగా ఉదయగిరికి వెళ్లే గ్రామీణ రహదారి కూడా సంవత్సరాల తరబడి మోకాళ్ల లోతు గోతులతో అధ్వాన్నంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటేనే భయంతో వణికిపోతుంటారు. నిత్యం జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మార్గం గుండానే ఉదయగిరికి వెళ్తుంటారే తప్ప కనీసం మరమ్మతులు చేయించాలన్న ఆలోచన కూడా రాకపోవడంతో ఈప్రాంత ప్రజలు సంత్సరాలతరబడి గోతుల రోడ్డులోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో పలు గ్రామీణ రోడ్లు అధ్వాన్నంగానే దర్శనమిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement