Monday, November 18, 2024

AP – నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం…

బారాషహీద్‌ దర్గా వద్దకు భారీ భక్తులు రాక‌
అయిదు రోజుల పాటు ఉత్స‌వం
విస్త్రుత ఏర్పాట్లు చేసిన యంత్రాంగం

ఆంద్ర‌ప్ర‌భ స్మార్ట్ – నెల్లూరు – నెల్లూరులోమొహ‌రం రోజైన నేడు రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారాషహీద్‌ దర్గా వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కోర్కెల రొట్టెలు పంచుకున్నారు. బారాషహీద్‌లకు గలేఫ్‌లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో సందడి నెలకొంది. 5 వేల మంది సిబ్బంది రొట్టెల పండుగ విధుల్లో ఉన్నారు. భద్రతా విధుల్లో 2 వేల మంది పోలీసులను నియమించారు. ఈ రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు జరగనుంది.

- Advertisement -

కాగా,భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకుని.. అది నెరవేరితే తర్వాత మరుసటి ఏడాది వచ్చి ఆ రొట్టెను వదలడం సంప్రదాయంగా వస్తోంది.
ప్రధానంగా సంతాన రొట్టె.. ఆరోగ్య రొట్టె.. చదువు రొట్టె.. వివాహ రొట్టె.. విదేశీ రొట్టె.. ఉద్యోగ రొట్టె.. ఇలా 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు.. భక్తుల రద్దీ అధికం కావడంతో రొట్టెల పండుగను ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నారు.

భక్తుల కోసం నెల్లూరు నగరపాలక సంస్థ.. పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లను చేశారు. చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు వీలుగా సూచిక బోర్డులు.. భక్తులు ఉండేందుకు గుడారాలు.. స్నానపు గదులు.. మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.. సీసీ కెమెరాలతో భక్తుల కదిలికలను పర్యవేక్షించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు.. అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు.

మరోవైపు.. నెల్లూరు చెరువులో బోటింగ్ కోసం పర్యాటక శాఖ ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ముందు జాగ్రత్తగా గజ ఈత గాళ్లను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. పండుగలో భాగంగా మొదటి రోజున సందల్ మాలీ.. రెండో రోజున గంధ మహోత్సవం నిర్వహిస్తారు. బారా షాహిద్ లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత ఆ గంధాన్ని భక్తులకు పంచి పెడతారు. మూడవ రోజున రొట్టెల పండుగ.. నాలుగో రోజు తహలీల్ ఫాతెహ.. ఐదో రోజున ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా భక్తులు.. ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement