Monday, November 25, 2024

AP | రాప్తాడు సిద్ధం సభ.. బాబు, పవన్ లపై జగన్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆవేశంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయట ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింకులో ఉండాలని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని ప్రజల రక్తం తాగడానికి వస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన కొనసాగాలంటే ప్రజలు రెండు బటన్లు నొక్కాలని జగన్ అన్నారు. ఒక బటన్ నొక్కి అసెంబ్లీకి.. రెండో బటన్ నొక్కి పార్లమెంట్కు వైసీపీని భారీ మెజార్టీతో పంపించాలని కోరారు.

చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్క పథకం కూడా లేదన్నారు జగన్. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, మనకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. వీళ్లెవరూ మన రాష్ట్రంలో వుండరు, అప్పుడప్పుడు వస్తుంటారని జగన్ ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. 2014లో మేనిఫెస్టోలో 650 హామీలిచ్చి.. అందులో పది శాతమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.

కానీ తాము 2019లో ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేశామన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశామన్న సీఎం.. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే ఇంకెన్నో చేస్తామని చెప్పారు. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం లంచం లేకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.

- Advertisement -

మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని.. ప్రజలతోనే పొత్తు అని జగన్ అన్నారు. జగన్కు ప్రజాబలం లేకపోతే చంద్రబాబుకు పొత్తులెందుకు అని ప్రశ్నించారు. సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు అని నిలదీశారు. చంద్రబాబు మోసాలకు విసుగు చెందిన ప్రజలు టీడీపీ కుర్చీలు మడచి 23కు తగ్గించారని సెటైర్ వేశారు. మరోసారి చొక్కా మడతపెట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అసెంబ్లీలో 175కు 175, లోక్ సభలో 25కు 25 ఎంపీ సీట్లు గెలవడమే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు.

మా ప్ర‌భుత్వంలో రైతులకు రైతుభరోసా తీసుకొచ్చి ఇచ్చామని.. రైతన్నకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారని.. చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనదని జగన్ పేర్కొన్నారు. ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్‌లో దిశ యాప్ తీసుకొచ్చామన్నారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలని జగన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement