Thursday, November 21, 2024

AP – డాలిమ్మ‌కు పురిటి క‌ష్టాలు.. మన్యంలో ఎన్నాళ్లీ వెత‌లు

అంబులెన్స్ వ‌చ్చేందుకు దారిలేదు
కిలో మీట‌ర్ల దూరం డోలీలోనే మోత
ఈ అవ‌స్థలను త‌ప్పించాలని ప్ర‌భుత్వానికి విన్న‌పం
సీఎం చంద్రబాబుకు.. పవన్ కళ్యాణ్‌కు గిరిజ‌నం వేడుకోలు

అది అందాల అరుకులోయ. అందులో ఓ కుగ్రామం కొంత్రాయిగుడ. నిజంగా అడవితల్లి ముద్దు బిడ్డే. చుట్టూ చెట్లు. తెల్లారగానే కోయిల పాట. కోడి కూత, చిలకల కిలకిలరావాల వీనుల విందు. కానీ ఈ గిరిజన గ్రామానికి దారితెన్నే దిక్కులేదు. సంతకు పోవాలంటే కాలి నడకే. ఆసుపత్రికి చేరాలంటే డోలే ఆధారం. ప్రతి గిరిజన గ్రామం కథ ఇదే.. కానీ.. ఒక అబ్బుర ఘటన సభ్య సమాజాన్ని కదిలించేలా చేస్తోంది.

- Advertisement -

క‌డుపుపండాల‌ని.. క‌నిపించిన రాయికీ మొక్కింది..

అరకులోయ మండలం బస్కి పంచాయతీలోని కొంత్రాయిగుడకి చెందిన సమర్ది డాలిమ్మ.. ఎన్నో ఏళ్లుగా తల్లి కావాలని తపిస్తోంది. మొక్కని మొక్కు లేదు. ఎట్టకేలకు కడుపు పండింది. నవమోసాలు మోసింది. ఇక ప్రసవ సమయం వచ్చేసింది. శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. ఇంటిల్లిపాది 108 కి ఫోన్ చేశారు. కానీ ఆ ఊరికి రోడ్డు సదుపాయం లేకపోవటంతో .. తాము రాలేమని ఆంబులెన్సు సిబ్బంది తెలిపారు. తరతరాలుగా తమ ఊరి అలవాటు ప్రకారం డోలిలో డాలిమ్మను తరలించారు.. ఆ అనుభవం వర్ణనాతీతం.

పురినొప్పులు.. ఆస్ప‌త్రికి చేర‌డం ఎలా?

వారికి కాలి బాట. రాళ్లే ముళ్లులా కాలికి గుచ్చుకుంటుంటే.. మరో వైపు గర్భణీ నొప్పులతో విలవిల్లాడుతుంటే వేగంగా డోలీతో ఉరుకులు పరుగులు పెట్టాలి. అదే రీతిలో అసలు రోడ్డు వరకూ మోసుకు వెళ్లారు. ఇంతలో అంబులెన్స్ వచ్చేసింది. డాలిమ్మను 108లో మాడగడ ఆసుపత్రికి తరలించారు. కాన్పు చేయించారు. సకాలంలో ఆసుపత్రికి చేర్చడంతో డాలిమ్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక కుటుంబ సభ్యులు ఆనందంతో గంతులేశారు. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తమ వ్యథలపై తప్పనిసరిగా అవగాహన ఉందని, త‌మ‌ గ్రామానికి రోడ్డు వేయించాలని, గిరిజన సంఘం నాయకులు కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబుని వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement