పార్వతిపురం – పీకలదాకా తాగిన తర్వాత మందుబాబులు వేసే చిందులు అన్నీ ఇన్నీ కావు.. 31న కొత్త సంవత్సరానికి స్వాగతం అంటూ ఓ మందు బాబు ఫుల్లుగా మందుకొట్టేసి ఏకంగా పోల్ ఎక్కి కరెంటు తీగలపైనే పడుకున్నాడు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగపురంలో చోటు చేసుకుంది..
సింగపురం నివాసి మంగళవారం నాడు పొద్దున్నే తాగేశాడు. అయినా చాలకపోవడంతో మందుకు డబ్బు కావాలని ఇంటికెళ్లి వాళ్ల అమ్మను అడిగాడు. కానీ ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంలో బయటకు వెళ్లిన అతను దగ్గరలో ఉన్న కరెంటు పోల్ ఎక్కేశాడు. మద్యం మత్తులో అతను విద్యుత్ స్తంభం ఎక్కడం చూసిన పలువురు అతని దగ్గరకు పరిగెత్తారు. కానీ వాళ్ల మాటలేమీ పట్టించుకోకుండా అతను పైకి ఎక్కేశాడు.
దీంతో కరెంటు తీగలు ముట్టుకుంటాడేమో అన్న భయంతో స్థానికులు ట్రాన్స్‌ఫార్మర్ ఆపేశాడు. మద్యం మత్తులో కరెంటు పోల్ ఎక్కిన ఆ మందుబాబు అంతటితో ఆగకుండా కరెంటు తీగలపై కాసేపు విన్యాసాలు చేశాడు. అనంతరం వాటిపైనే పడుకున్నాడు. కరెంటు స్తంభం దిగి రావాలని అతని కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంతసేపు అడిగినా పట్టించుకోలేదు. దాదాపు అర గంటపాటు ఆ కరెంటు తీగల మీదనే ఉన్నాడు. చివరకు మందుకు డబ్బులిస్తామని బుజ్జగించడంతో మెల్లిగా కిందకు దిగాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.