Saturday, November 23, 2024

ఏపీలో ర‌ణ‌రంగం.. దాడులు, ఆందోళ‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న రాష్ట్రం

YSRCP V/s TDP: అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. నిన్నమొన్నటి దాకా మాటలతో సరిపెట్టుకున్న ఇరు పార్టీలు ఇప్పుడు దాడులకు తెగబడేదాకా వచ్చాయి. దీంతో ఏపీ రణరంగంగా మారింది. గంజాయి, డ్రగ్స్‌ను వైసీపీ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ టీడీపీ నేత పట్టాభి ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఇదే ఇరు పార్టీల మధ్య గొడవకు దారితీసింది. పట్టాభి తన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్త ంచేశారు. అంతటితో ఆగకుండా పలువురు నేతలు పట్టాభి ఇంటిపైన, టీడీపీ ఆఫీసులపైనా దాడి చేశారు. అంతేకాకుండా టీడీపీ నేతల ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత చంద్రబాబు పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వెంటనే గవర్నర్‌, అమిత్‌ షాలతో ఫోన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కేంద్ర బలగాలను పంపాలని విజ్ఞప్తి చేశారు.

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వ‌హించాల‌ని టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు.

మరోవైపు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. పలాస ఆర్టీసీ డిపో వద్ద ఆందోళనకు దిగిన నేతలను అరెస్ట్ చేశారు.

రాజాంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును గృహ నిర్బంధం చేశారు. విశాఖపట్టణంలోనూ పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌తోపాటు 10 మంది నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. టీడీపీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ టీడీపీ నేతలు నిరసనలకు దిగారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును, పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులు, పెడనలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

- Advertisement -

ఇక గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అరవిందబాబును అరెస్ట్ చేసి శావల్యాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఆందోళనతో పలుచోట్ల జాతీయ రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి.

రాయలసీమలోనూ టీడీపీ నేతల అరెస్ట్, గృహనిర్బంధాలు కొనసాగాయి. మైదుకూరులో టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి, నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్, లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, కర్నూలులో టీడీపీ నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు, డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేఈ ప్రభాకర్, నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మల్సీ ఫరూక్, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement