Tuesday, November 26, 2024

AP Political Story – వైసిపిలో ప‌ద‌వుల పండుగ‌…రేపో మాపో జాబితా రిలీజ్

ఆంధ్రప్రభ, అమరావతి బ్యూరో: వైకాపాలో పదవుల పండుగ రాబోతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్టీ పదవులను వైకాపా అధిష్టానం భర్తీ చేయబోతున్నది. కీలకమైన రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులతో పాటు 18 అనుబంధ సంఘాల పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులతో పాటు పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు సంబం ధించి ఇప్పటికే దాదాపు కసరత్తు పూర్తి కావచ్చింది. ఆయా జిల్లాల నుంచి పార్టీ అధ్యక్షులు జాబితాలు కూడా కేంద్ర కార్యాలయానికి పంపారు. ఒకట్రెండు రోజుల్లో జిల్లాల వారీగా వివిధ పదవులను భర్తీ చేస్తూ అధికారికంగా జాబితా ను ప్రకటించబోతున్నారు.

ఇదే సందర్భంలో నామినేటెడ్‌ పోస్టులకు సంబంధించి జూలై, ఆగస్టులో రాష్ట్ర స్థాయిలో చైర్మన్‌ పదవులతోపాటు పలు డైరెక్టర్ల పదవులకు పదవీ కాలం ముగియనుంది. అలాగే జిల్లా స్థాయిలోకూడా మరికొన్ని నామినేటెడ్‌ పదవులకు గడువు ముగుస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారినే తిరిగి మరో ఏడాది పాటు కొనసాగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు జిల్లాల్లో మాత్రం స్వల్పంగా మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద పార్టీలో ఖాళీగా ఉన్న కీలకమైన పదవులతో పాటు అన్నివిభాగాలకు సంబంధించిన అధ్యక్ష, కార్యదర్శులతో ఇప్పటికే ఏర్పాటైన సంఘాలకు పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వందల సంఖ్యలో పార్టీ పదవులు భర్తీ కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా అన్ని పదవులను భర్తీ చేసి పార్టీ శ్రేణు ల్లో నూతనోత్సాహంతో పాటు పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని యోచిస్తూ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లాల వారీగా కీలకమైన పదవులను జెండా మోసిన వారికి కట్టబెట్టాలని, ఆ దిశగానే జాబితాను రూపొందించాలని ఇప్పటికే పార్టీ పెద్దలకు సూచించారు. వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. 2019 చివరిలో కీలకమైన పదవులను భర్తీ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కేబినేట్‌ హోదా కలిగిన వివిధ నామినేటెడ్‌ పోస్టులను కూడా ముఖ్యమైన నేతలకు కట్టబెట్టింది. అలాగే జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌లు, పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌లతో పాటు మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌లను కూడా భర్తీ చేసింది. అలాగే పార్టీపరంగా జిల్లా అధ్యక్షులు, నగర పార్టీ అధ్యక్షులు వంటి పదవులను భర్తీ చేసినప్పటికీ జిల్లా కమిటీలను పూర్తి స్థాయిలో నియమించలేదు. అలాగే అనుబంధ సంఘాలకు సంబంధించి కొన్ని సంఘాలకు అధ్యక్ష కార్యదర్శులను నియమించినప్పటికీ మిగిలిన కమిటీని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పార్టీ పదవులతో పాటు వివిధ కారణాలతో పార్టీ పదవుల్లో నుంచి తప్పుకోవడంతో మరికొన్ని పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటిని రానున్న వారం, పదిరోజుల్లోపు భర్తీ చేసి అధికారికంగా ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తూ ఆ దిశగా కసరత్తు చేస్తోంది.

జిల్లాల వారీగా జాబితాలు
పార్టీపరంగా ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడంతో పాటు అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేసే బాధ్యతను సీఎం జగన్‌ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. ఆయన గత 15 రోజులుగా తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో నిత్యం ముఖ్య నేతలతోనూ, అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులతోనూ సమావేశాన్ని నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదే సందర్భంలో అనుబంధ సంఘాల్లో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పార్టీకి అండగా నిలిచిన వారికి పార్టీ పదవులు అప్పగించాలని ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా మూడు, నాలుగు సంవత్సరాలుగా నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకుల్లో ఎక్కువ మందికి ఆ పదవులు లభించే అవకాశాలు లేకపోవడంతో పార్టీ పదవులను అప్పగించాలని యోచిస్తున్నారు. ఆ దిశగానే జిల్లాల వారీగా పార్టీ విధేయుల జాబితాను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పంపిన జాబితా ఆధారంగా త్వరలో జిల్లాల వారీగా ముఖ్య నేతలకు పార్టీ పదవులు దక్కబోతున్నాయి. అయితే వారిలో కొంత మంది తమకు నామినేటెడ్‌ పదవులు కావాలని పట్టుబడుతుండడంతో అటువంటి వారికి జిల్లా స్థాయిలో ప్రస్తుతానికి పార్టీ పదవుల పగ్గాలను అప్పగించబోతున్నారు. ఇదే సందర్భంలో రానున్న రెండు నెలల్లో వివిధ నామినేటెడ్‌ పదవులకు సంబంధించి పదవీ కాలం ముగియనున్న నేపధ్యంలో దాదాపుగా 80 శాతం పదవులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వారినే తిరిగి కొనసాగించేలా మరో ఏడాది కాలం పాటు వారు ఆ పదవుల్లో కొనసాగేలా పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన జాబితా కూడా సిద్ధమైంది. మిగిలిన 20 శాతం పదవులను ఆయా ప్రాంతాల్లో ముఖ్య నేతలకు కట్టబెట్టాలని యోచిస్తున్నారు. అందుకు సంబంధించిన జాబితా కూడా పరిశీలనలో ఉంది. మొత్తానికి రానున్న వారం రోజుల్లో అధికార వైసీపీలో పెద్ద ఎత్తున పార్టీ పదవుల పందారం జరుగబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement