– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠా పని పట్టారు. ఈ క్రమంలో గ్యాంగ్‌కి చెందిన ఆరుగురితోపాటు పిస్టల్స్, రివాల్వర్స్, మందుగుండు సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వివరాలు ఇవ్వాల (సోమవారం) వివరాలు వెల్లడించారు. అనంతపురం పోలీసుల జరిపిన స్పెషల్ ఆపరేషన్‌లో బెరెట్టా 9ఎంఎం సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, రివాల్వర్, తపాంచాలతో పాటు కొంత మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గ్యాంగ్ మెంబర్స్ బెంగళూరుకు చెందిన జంషీద్ అలియాస్ ఖాన్ (37), ముబారక్ (43), అమీర్ పాషా (30), రియాజ్ అబ్దుల్ షేక్ (36), మధ్యప్రదేశ్‌కు చెందిన రాయ్‌పాల్ సింగ్ (30), నన్నూ సుతార్ ఆదివసాసి (25) అనే ఆరుగురిని అరెస్టు చేశారు.
అనంతపురం జిల్లా స్పెషల్ ఆపరేషన్స్ బృందం బెంగళూరు, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. జూదం, మాదకద్రవ్యాల వ్యాపారం, ఆయుధాల అక్రమ రవాణా వంటి నేరాలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టామని.. ఈ క్రమంలో “జీరో టాలరెన్స్ పాలసీ” ఆధారంగా ఈ గ్యాంగ్‌ని పట్టుకున్నట్టు తెలిపారు. బెంగుళూరు నగరంలో అక్రమంగా సంపాదించిన ఆయుధాల వినియోగం ద్వారా నిందితులు ముఠా కక్షలు, కిరాయి హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఏపీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ బృందం విచారణలో తేలింది. అక్రమ ఆపరేషన్‌ను ఛేదించిన పోలీసు బృందానికి రూ.25,000 నగదు బహుమతి కూడా ప్రకటించారు.
ప్రధాన ఆయుధ వ్యాపారి, తయారీదారు అయిన రాజ్‌పాల్ తన అక్రమ ఫ్యాక్టరీలో ఆయుధాలను తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. క్రిమినల్ ముఠాలు రాజ్‌పాల్ ద్వారా లబ్ది పొందుతూ క్రమం తప్పకుండా ఆయుధాలను సేకరించేవారు. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తులు బెంగళూరు నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారని, అనంతపురం జిల్లాకు కూడా తమ స్థావరాన్ని విస్తరించేందుకు యత్నిస్తున్నారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.