అమరావతి, ఆంధ్రప్రభ: దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుకు మంచి పేరు ప్రఖ్యాతు లు లభిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోపాటు, పోలీసు క్రీడల్లోనూ జాతీయ స్ధాయిలో వి శేష గుర్తింపు పొందిన రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా మరో ఘనతను దక్కించుకుంది. ప్రజల పట్ల విశ్వాసం చూరగొనడం, సమర్ధత, నిజాయితీ వంటి అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలో మనేమే టాప్‌లో ఉన్నాము. ఇదే విషయాన్ని ఇటీవల ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్రం ప్రకటించడం విశేషం . ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల డీజీపీలతో
ఈనెల 20 నుండి 22 వరకు మూడు రోజుల పాటు- జరిగిన సమావేశాలకు మన రాష్ట్ర డీజీపీ కెవి రాజేంద్రనాధ్ రెడ్డి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోలీసుశాఖపై ప్రజల విశ్వాసం, సమర్థత, నిజాయితీకి సంబంధించిన అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలతో అంతకుముందే సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వే ఫలితాల్లో మూడు అంశాలకు సంబంధించి మొదటి ఐదు రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్ధానంలో ఉంది. ఇందుకు సంబంధించిన సర్వే నివేదికను సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోలీసులపై ప్రజల విశ్వాసం అంశానికి సంబంధించి తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీలతో పోటీ పడగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్ధానంలో నిలిచింది. సమర్ధత విషయానికొస్తే.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌తో తలపడగా ఏపీ ప్రధమ స్ధానం దక్కింది. అదేవిధంగా నిజాయితీకి సంబంధించిన సర్వేలో ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీతో ధీటుగా ఏపీ రాష్ట్రం తొలి స్ధానంలో నిలిచింది.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు: డీజీపీ
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు గర్వకారణమని డీజీపీ కెవి రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. గత ఏడాది పోలీసు శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యల ద్వారా ఈ ఫలితాలు లభించాయి. 1.7 కోట్లు- దిశ మొబైల్ అప్లికేషన్ రిజిస్ట్రేష్రన్లు, సాంకేతికతో కూడిన కచ్చితమైన సాక్ష్యాధారాలు, నేర నిరూపణతో శిక్ష పడే విధంగా దర్యాప్తు, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్, సాంకేతికత వినియోగం ద్వారా త్వరితగతిన పోలీసు ప్రతిస్పందన, పోలీసులలో క్రమశిక్షణా విధానాన్ని పెంపొందించడం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో జిల్లా ఎస్పీల నుండి కానిస్టేబుళ్ల వరకు చేసిన కృషి ద్వారా ఈ ఫలితాలు లభించాయి. ఈ ఫలితాలను సాధించడంలో సహకరించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
సీఎం అభినందనలు
కాగా గత ఏడాది పోలీసు శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యల ద్వారా ఈ గౌరవ పురస్కారాలు లభించాయి. విశ్వాసం, సమర్థత, నిజాయితీలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీస్ శాఖను, డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.