Tuesday, November 26, 2024

AP | జల శుద్ధి కేంద్రంలో విషప్రయోగం.. నర మేధ కుట్ర భగ్నం

కణేకల్లు (అనంతపురం) ప్రభన్యూస్ : అనంతపురం జిల్లాలో రాజకీయ కక్షతో ఓ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణహోమానికి పాల్పడ్డారు. గ్రామస్తులు అప్రమత్తం కావటంతో భారీ కుట్ర భగ్నమైంది. జరగరానిది జరిగి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమయ్యేదని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తుంబిగనూరు గ్రామంలో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. గత ఎన్నికల్లో తమ పార్టీకి మెజారిటీ రాలేదనే కక్షతోనే ఈ అకృత్యానికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది.

వివరాల్లోకెళ్తే.. తుంబిగనూరు గ్రామంలో గాలి మరలకు చెందిన ఓ సంస్థ గతంలో గ్రామస్థుల దాహార్తిని తీర్చాలనే సదుద్దేశంతో మంచి నీటి శుద్ధి జల కేంద్రాన్ని నెలకొల్పింది. వైసీపీకి చెందిన సర్పంచ్ ఫణీంద్ర ఆధీనంలో ఈ నీటి శుద్ధి కేంద్రం కొనసాగుతోంది. ఒక్కొక్క నీటి క్యాన్ కు రూ.5 చొప్పున వసూలు చేసే బాధ్యత కూడా ఆయన నిర్వహిస్తున్నారు.

ఇటీవలే సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు 41,659 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తుంబిగనూరు పోలింగ్ స్టేషన్ లో టీడీపీకి 512 ఓట్లు, వైసీపీకి 494 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో టీడీపీకి 18 ఓట్ల మెజార్టీ వచ్చింది. సర్పంచి వైసీపీ నేత కావటంతో.. తన గ్రామంలో ఓట్లు తగ్గటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోయారు.

ఇదిలా ఉంటే.. ఎప్పటిలాగే రోజు వారీగా శనివారం ఉదయం గ్రామస్తులు శుద్ధి జలం సేకరణకు వచ్చారు. ఆ ప్రాంతంలో ఘాటైన పురుగుమందు వాసనను గుర్తించారు. నీటిని పరిశీలిస్తే రంగు మారినట్టు తేలింది. వెంటనే నీటి కేంద్రాన్ని పరిశీలించగా పురుగుల మందు ద్రావణం కిటికీలో నుంచి చెల్లాచెదురుగా పడిన దృశ్యం కనిపించింది. వాటరర్ ట్యాంకులో విషపు డబ్బాను గమనించిన గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు.

ఈ సమాచారంతో ఊరి జనం నీటి కేంద్ర దగ్గరకు చేరుకుని నిర్ఘాంతపోయారు. తమ గ్రామంలోని నీటిసరఫరా కేంద్రంలో విష ప్రయోగం జరిగిందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ.శ్రీనివాసులు ఘటనాస్థలికి చేరుకుని జరిగిన ఉదంతంపై ఆరా తీసి, తక్షణమే సీఐ.శ్రీనివాసులు, డీఎస్పీ. శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ గౌతమి శాలి కి సమాచారం అందించారు.

- Advertisement -

కూటమి గెలుపును జీర్ణించుకోలేక ఊరినే వల్లకాడు చేయాలనే దురాలోచనలోనే వైసీపీ కుట్రకు పాల్పడిందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. సర్పంచ్ ఫణీంద్ర ప్రోద్బలంతో ఘోరమైన కుట్రకు తెర లేపారని టీడీపీ నాయకులు, గ్రామస్తులు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు.

నీటి కేంద్రం బంద్ చేసే సమయంలో కిటికీలు వేయక పోవడం, నీటి ట్యాంకు మూత లేక పోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య, లేక రాజకీయ పైశాచిక చర్య అనే అంశాన్ని ఛేదిస్తామని పోలీసులు చెప్పారు. ఘటన స్థలిలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో పరిసరా ప్రాంతం అంతా పోలీసులు గాలించారు. పెనువిషాద ఘటన సృష్టికి వైసీపీ తెర లేపిందని గ్రామస్తులే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తాము అప్రమత్తం కాకపోతే తమ గ్రామం స్మశానంగా మారేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement