Monday, July 1, 2024

AP – నెల్లూరు సెంట్రల్ జైలుకు పిన్నెల్లి … మాచర్లలో అధీపత్యానికి ఇక తెర

మే 13న పోలింగ్ తరుణంలో మాచర్ల నియోజకవర్గంలో రేగిన అలజడిలో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పై పోలీసులు 14 కేసులు నమోదు చేశారు. ఇందులో మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. దాదాపుగా పిన్నెల్లి బ్రదర్స్ కు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవని న్యాయవాదులు చెబుతున్నారు. ఆ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం, రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి బ్రదర్స్ రెచ్చిపోయారు. ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీయటంతో ఆమెను దుర్భాషలాడారు. దీనిపై రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాఉ. ఈవీఎం ధ్వంసం ఘటనను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి చేశారు. ఎమ్మెల్యే, మరో 15 మందిపై సెక్షన్ 307, 147, 148, 120బీ, ఐపీసీ సెక్షన్ కింద రెంటచింతల పీఎస్ లో కేసు నమోదైంది. తనను చంపేయాలని వైసీపీ శ్రేణుల్ని ఉసిగొల్పినట్టు శేషగిరిరావు ఫిర్యాదు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అనుచరులు చింతా సుబ్బారావు, మరికొందరిని కేసులో చేర్చారు.

- Advertisement -

కారంపూడి పీఎస్ లో ..

మే 14న పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు. టీడీపీ కార్యాలయంపై దాడిచేశారు. అడ్డుకున్న సీఐ నారాయణస్వామిని గాయపర్చారు. వీఆర్వో ఫిర్యాదుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సహా అనుచరులపై ఐపీసీ 307, 332, 143, 147, 324. 149 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఈ కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ వస్తుందో రాదో అర్థం కాని స్థితి. ఇక ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కండీషన్ బెయిల్ తో రామకృష్ణారెడ్డి నరసరావుపేటలోనే మకాం చేశారు. ఇక వెంకట్రామి రెడ్డి జాడ పోలీసులకు తెలియటం లేదు. ఆయననూ అరెస్టు చేయటానికి పల్నాడు పోలీసుల బృందం గాలిస్తోంది.

పిన్నెల్లి..ఆధిపత్యానికి కళ్లెం

మాచర్ల నియోజకవర్గం లో తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.1989 నుంచి దాదాపు 15 ఏళ్లు మాచర్ల గడ్డను ఏలిన టీడీపీకి 2004లో బ్రేక్ పడింది. పిన్నెల్లి కుటుంబ రాచరికం ప్రారంభమైంది. పిన్నెల్లి లక్ష్మారెడ్డి అనారోగ్యం కారణంగా.. మాచర్లను ఆయన సోదరుడు కుమారుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రామకృష్ణా రెడ్డి ఏకచత్రాధపత్యం కొనసాగింది. గత నాలుగు ఎన్నికల్లోనూ 2009 నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైత్రయాత్ర సాగింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జెండాను మళ్లీ రెపరెపలాడించాలని చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. పిన్నెల్లికి సమతూహంగా జూలకంటి కుటుంబానికి చెందిన బ్రహ్మారెడ్డి ని రంగంలోకి దించారు.అయితే, బ్రహ్మారెడ్డిని మాచర్ల పట్టణంలోకి పిన్నెల్లి వర్గం అడుగు పెట్టనీయని ఘటనలెన్నో ఉన్నాయి.

ప్రతి చిన్న విషయానికి బ్రహ్మారెడ్డి పై కేసులు నమోదు చేశారు, ఆయన అద్దెకు తీసుకున్న ఇంటినీ తగలబెట్టారు. ఆయన అనుచరులపై కేసులు పెట్టారని పిన్నెల్లి సోదరులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జూలకంటి బ్రహ్మారెడ్డి పై సానుభూతి పెరిగింది. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన జూలకంటి బ్రహ్మారెడ్డి పై సానుభూతి పవనాలు కనిపించాయి. ఎన్నికల నామినేషన్ దగ్గర నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధిపత్యం కొనసాగింది. వ్యవస్థలలో మార్పులు కూడా కనిపించాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులలో కసి కనిపించింది. అక్కడక్కడ అల్లర్లు కూడా కొనసాగాయి. పాల్వాయి జంక్షన్ పోలింగ్ బూత్ లో వైసీపీ ఏజెంట్లను కొట్టారనే ఆరోపణల నేపథ్యంలోనే అక్కడికి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎలక్షన్ కమిషన్ పిన్నెల్లి పై కేసు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేయడం, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి ఉచ్చు బిగిసింది. ఎన్నికల ఫలితాలు రావడం, గతంలో ఎన్నడూ లేని మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించారు. ఇలా పిన్నెల్లి ఆధిపత్యానికి సంకెళ్లు పడ్డాయని మాచర్ల ప్రజలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement