ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ అయ్యింది. ఈవీఎం ధ్వంసం ఘటనలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసు విచారణలో ఇరుపక్షాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు.
ఈవీఎం ధ్వంసం కేసులో ఇటీవల పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పిన్నెల్లికి కూడా హైకోర్టు పలు షరతులు విధించింది. జూన్ 6వ తేదీ వరకు నరసరావుపేటలోనే ఉండాలని, కౌంటింగ్ రోజున మాచర్లకు వెళ్లరాదని ఆదేశించింది.
అయితే ఆ తర్వాత పిన్నెల్లిపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేట్ వద్ద బూత్ నెంబర్ 202లో టీడీపీ ఏజెంట్ పై గొడ్డలితో దాడి, కారంపూడిలో సీఐపై దాడి, పాల్వాయి గేట్ బూత్ నెంబర్ 202 వద్ద నాగశిరోమణి అనే మహిళపై దాడి జరిగింది. ఈ మూడు ఘటనలకు సంబంధించి పిన్నెల్లిపై మూడు కేసులు నమోదయ్యాయి. మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. వాటిలో ఒకదానికి ముందస్తు బెయిల్ వచ్చింది.