(ఏఎన్‌యూ క్యాంపస్) ప్రభ న్యూస్: రాష్ట్రంలోని వ్యాయామ కళాశాలల్లో ఉన్న బీపీఈడీ , యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ పీసెట్-2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను సోమవారం ఖరార చేశామని ఆచార్య పి జాన్సన్ తెలిపారు. పీసెట్ ప్రవేశాలకు సంబంధించిన కమిటీ సమావేశం సోమవారం ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆన్‌లైన్‌లో ఈనెల 20 నుంచి 22 వరకు రిజిస్ట్రేషన్ సదుపాయం, ఈనెల 21 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌సో విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని హెల్ప్లైన్ కేంద్రంలో ఈ నెల 22న ఎన్సిసి, క్యాప్ కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. అలాగే ఈనెల 25 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్స్, ఈ నెల 27న వెబ్ ఆప్షన్స్ లో మార్పులకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 29న సాయంత్రం ఆరు గంటల తర్వాత వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశాలను కేటాయిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి నవంబర్ 4వ తేదీ లోపు వారికి కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని కమిటీ నిర్ణయించింది.