జగన్ దోచుకున్నదే ఎక్కువ
ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు
16 కేంద్ర పథకాలను ఆపేశారు
మోయలేనంతం విద్యుత్ భారం
భరించలేనంతగా పన్నులు పెంచారు
అక్కాచెల్లెమ్మలకు.. అవ్వతాతలకు ఇచ్చింది తక్కువే
స్థానిక సంస్థలకు రూ.250 కోట్లు విడుదల
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి :
అక్కా చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు ఇచ్చిన దానికంటే జగన్ దోచిందే ఎక్కువని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ ఎపి సచివాలయంలో గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ.250 కోట్లు స్థానిక సంస్థలకు విడుదల చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తన మొదటి బాధ్యతగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 16 పథకాలను ఆపేసిందని.. వాటిలో 60 శాతం రాష్ట్రం… 40 శాతం కేంద్రం నిధులు పెట్టేవని పేర్కొన్నారు. వీటి మొత్తాన్ని ఆపేశారని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
కేంద్రం నిధులు వాడులోనే స్థితి..
కేంద్రం నిధులు కూడా వాడుకోని పరిస్థితి వైసీపీ హయాంలో ఉందన్నారు. వ్యవస్థలు అన్నీ గాడి తప్పాయన్నారు. ఎవరు జగన్‌కి సలహా ఇచ్చారో కూడా తెలియదని పయ్యావుల కేశవ్ అన్నారు.రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం.. ఎకానమీని పునరుద్ధరించడం తమ లక్ష్యమని పయ్యావుల కేశవ్ తెలిపారు. గడచిన ఐదేళ్లలో వ్యవస్థను దెబ్బతీశారన్నారు. కామన్ మ్యాన్ నుంచి వచ్చే కన్నా పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగిస్తే ఎంతో మేలన్నారు. ఎలక్ట్రసిటీపై డ్యూటీలను దారుణం గా పెంచారన్నారు. అక్క చెల్లమ్మలకు, అవ్వ తాతలకు జగన్ ఇచ్చిన దాని కన్నా దోచింది ఎక్కువని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు టీం శక్తికి మించి ఈ రాష్ట్రం కోసం పని చేస్తోందన్నారు. ఏపీలో టాక్సాషన్‌ను కౌంటర్ ప్రొడక్ట్ లెవెల్‌కి తీసుకు వెళ్లారన్నారు. టాక్స్‌లు పెంచడం ఒక స్థాయికి తెచ్చారని.. చివరకు భరించలేకుండా చేశారన్నారు. వ్యాపారాలను ధ్వంసం చేశారన్నారు.