అసలు బడ్జెట్ పెట్టే స్థితే లేదు
అప్పులు మీద అప్పులు చేశారు
అప్పులు రూ.10లక్షల కోట్లకు చేరింది
93 కేంద్రం పథకాలు నిలిపివేశారు
ఉద్యోగుల అకౌంట్లలో రూ.80 వేల కోట్లు కనపడటం లేదు
సిబ్బందికి జీతాలూ మర్చిపోయారు
పంచాయతీలకు రూ.1450 కోట్లు ఇచ్చాం
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల
ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి : ‘‘బడ్జెట్ పెట్టలేదు అని పదేపదే వైసీపీ నేతలు అన్నారు. అసలు బడ్జెట్ పెట్టడానికి వీలు లేని రీతిలో ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు’’ అని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌పై ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో పాలసీలు రాష్ట్ర అభివృద్దికి ప్రతికూలంగా పనిచేశాయని అన్నారు. అభివృద్ది కోసం అప్పులు చేయాలి తప్ప సంక్షేమం కోసం అప్పులు చేయడం సరికాదన్నారు. ‘‘చంద్రబాబు నాయుడు అధికారంలో దిగిపోయిన రోజు అప్పులు రూ. 3 లక్షల 75 వేల కోట్లు. జగన్ ప్రభుత్వం దిగిపోయినప్పడు ఉన్న అప్పులు రూ. 9 లక్షల 70 వేల కోట్లు అంటే దాదాపు రూ.10 లక్షల కోట్లు. అప్పలు వివిధ పద్దుల కింద ఉంటాయి. ఒకే చోట ఉండవు. తెచ్చిన ప్రతి రూపాయిలో 60 శాతం మూలధన వ్యయంగా టీడీపీ హయాంలో పెట్టాం. జగన్ తెచ్చిన అప్పుల్లో 22 శాతం మూలధన వ్యయానికి ఖర్చు చేశారు. లెక్కల్లోకి వెళ్తే అది 15 శాతమే ఉంది. రూ. 1600 కోట్లతో పట్టిసీమ కడితే అయిదేళ్లలో రూ. 44 వేల కోట్లు అది రైతాంగానికి తెచ్చిపెట్టింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యక్తిగత సంపదను పెంచడం మాత్రమే తెలుసు. ప్రజల సంపదను పెంచడం వారి ఉద్దేశం కాదు’’ అని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
ఆ పథకాలను ఆపేసింది
‘‘కేంద్రం ఇచ్చిన 93 పథకాలను ఆపేశారు. 100 శాతం గ్రాంట్ ఇచ్చే పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఆపేసింది. ఇప్పడు ఒక్కో పథకం రివైవ్ చేయాలంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60 పైసలు రాష్ట్రం ఇవ్వాల్సిన 40 పైసలు కట్టాల్సి వచ్చింది. అప్పులు, అప్పులకు వడ్డీలు ఆ వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్ధితి ఉంది. గతంలో అప్పుల కోసం తప్పులు చేశారు. పొరుగు రాష్ట్రాలు 8 శాతం వడ్డీకి తెస్తే వీరు 10.50 శాతానికి చేశారు. ఉద్యోగులు రూ.80 వేల కోట్లు సీపీసీ, స్మాల్ డిపాజిట్లు వంటివి ఉంటాయి వాటికి ప్రభుత్వం ధర్మకర్త. ఆ అకౌంట్లలో రూ.80వేల కోట్లు కనపడటం లేదు. ఇందులో రూ.21 వేల కోట్లు రాజ్యాంగ బద్ధంగా విధిగా ఇవ్వల్సినవి కూడా దారి మళ్లించారు. ఇది ఆర్థిక అరాచకం అని కూడా అనలేం, అంతకు మించి చేశారు’’ అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
సొంత పనుల కోసమే ఢిల్లీకి వెళ్లారు
వైసీపీ సర్పంచులు ఉన్న చోట నిధులు ఇవ్వకపోవడంతో రూ. 1450 కోట్లు గ్రామాలకు అందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతం ఇవ్వడం మర్చిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలు చేశామని ఉద్ఘాటించారు. అమరావతికి ఇచ్చిన రూ. 15వేల కోట్లు అప్పుగా తెచ్చామో, గ్రాంటా అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఢిల్లీకి వెళ్లారంటే వారి వ్యక్తిగత కేసుల కోసమేనని ఆరోపించారు. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమి పూజ చేయిస్తామని తెలిపారు. రూ. 55 వేల కోట్ల జాతీయ రహదారిని రెండున్నరేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం డివెల్యూషన్లో రూ. 5700 కోట్లు అధనంగా ఈసారి వచ్చిందని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల ప్రతి ఢిల్లీ పర్యటన ఏదో ఒక లబ్ధిని రాష్ట్రానికి కలుగ జేస్తోందని తెలిపారు. దళిత విద్యార్థులకు నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యవుల కేశవ్ హామీ ఇచ్చారు.