Thursday, October 3, 2024

AP – జ‌గ‌న్ రూల్ బుక్ చ‌దువుకో …. వైసిపి అధినేత‌కు ప‌య్యావుల ఘాటు రిప్లై

వైసిపి అధ్యక్షుడు జగన్‌ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి జగన్ రాసిన లేఖ పై ఆయ‌న స్పందించారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ,
ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. ముందు రూల్ బుక్ చ‌ద‌వాలంటూ జ‌గ‌న్ కు హిత బోధ చేశారు. జగన్‌కు ఆప్తుడైన కేసీఆర్‌ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్‌కు జగన్‌ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడమేంటని నిలదీశారు.

- Advertisement -

అప్పుడు మీ నోటితో మీరే చెప్పారుగా?

మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిటికేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదన్నారు.. ఏమైంది? శాసనసభ సాక్షిగా మీ నోటితో మీరే చెప్పారు కదా? మళ్లీ ఇప్పుడు 10 శాతం నిబంధన లేదు.. తూచ్‌ అంటారా? ప్రజలు అధికారం తీసేసినా కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్లుంది. ప్రతిపక్ష హోదాతో క్యాబినెట్‌ ర్యాంకు వస్తుంది.. దానితో జులుం చేయొచ్చనుకుంటున్నారేమో! ఆ ధోరణి మార్చుకోండి. ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించండి. సభలో మీరు మాట్లాడాలనుకుంటే.. అందరి సభ్యుల్లాగే మీకూ మాట్లాడే హక్కు ఉంటుంది. పార్లమెంట్‌లో ఉపేంద్రను ఫ్లోర్‌ లీడర్‌గా పేర్కొన్నారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 1994లో ప్రతిపక్ష నేతగా పీజేఆర్‌ లేరు. అప్పుడు సీఎల్పీ నేతగా విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా అప్పటి స్పీకర్‌ ఆయన్ను గుర్తించారు. బాబూరావు, పీజేఆర్‌ సీఎల్పీ ఉపనాయకులుగా ఉన్నారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి” అని పయ్యావుల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement